- ఓఆర్ఆర్ లోపల 50 సర్కిళ్లు
- లోకల్ బాడీలు కలిపి టెంపరరీగా 57 సర్కిళ్లు ఏర్పాటు
- ఏడు సర్కిళ్లు తగ్గించి 50కి కుదించనున్న బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: లోకల్ బాడీల విలీనం తర్వాత వార్డుల విభజన, ఇతర అంశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వేగాన్ని పెంచారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఒక్కో సర్కిల్ గా ఏర్పాటు చేసి సర్కిళ్లకు ఇది వరకు అక్కడ మున్సిపల్ కమిషనర్లుగా ఉన్న వారికే డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలను అప్పగించారు. ఇలా ఇప్పటికే 30 సర్కిళ్లు ఉండగా, లోకల్ బాడీలు విలీనం తర్వాత ఏర్పాటు చేసిన 27 సర్కిళ్లను కలిపితే తాత్కాలికంగా 57 సర్కిళ్లు ఏర్పడ్డాయి. ఈ సర్కిళ్లు ఆరుగురు జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే, ఇదంతా తాత్కాలికం మాత్రమే.. కొద్ది రోజుల్లో ఇందులో చాలా మార్పులు చేయనున్నారు.
ముందుగా జోన్ల సంఖ్య 10కి పెంచి తర్వాత వార్డుల డీలిమిటెషన్ కి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ తర్వాత వారం పాటు అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేర్పులు చేసి ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్చేస్తారు. దీని ప్రకారం టెంపరరీగా ఏర్పాటు చేసిన 27 సర్కిళ్లలో ఏడు సర్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం 50 సర్కిళ్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్కు ఐదు సర్కిళ్లు అప్పగించనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం గ్రేటర్ లో 306 వార్డులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలా ఆరు వార్డులను కలిపి ఒక సర్కిల్ గా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
విలీనం తర్వాత శానిటేషన్ పైనే ఫోకస్
విలీన లోకల్ బాడీల్లో శానిటేషన్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 4న రికార్డుల స్వాధీన ప్రక్రియ ముగిసిందంటూ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు.. కమిషనర్ కు సమాచారమివ్వగానే జీహెచ్ఎంసీ తరహాలో శానిటేషన్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థల్లో శానిటేషన్ పనులను పర్యవేక్షించిన ఇంజినీర్లనే స్పెషలాఫీసర్లుగా నియమించే ప్రక్రియను హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం చేపట్టింది. ప్రస్తుతం ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లుగా నియమితులైన వారు స్థానిక సంస్థల్లో శానిటేషన్ బాధ్యతలు చూస్తుండగా, వారినే త్వరలో శానిటేషన్ స్పెషలాఫీసర్లుగా నియమించే అవకాశం ఉంది.
దీనికి తోడు మొన్నటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు మ్యానువల్ గా జరిగేవి, కానీ ప్రస్తుతం వాటన్నింటినీ జీహెచ్ఎంసీ మాదిరిగానే ఆన్ లైన్ పరిధిలోకి తీసుకురావాలని కమిషనర్ ఐటీ వింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో పాటు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను కూడా జీహెచ్ఎంసీ పోర్టల్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
