
- వచ్చే శాసనసభ సమావేశాల్లో సవరణ బిల్లు: మంత్రి పొంగులేటి
- మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచన చేస్తున్నం
- పాత అపార్ట్మెంట్స్కూ వెసులుబాటు కల్పిస్తున్నం
- సామాన్యులపై భారం పడకుండా భూముల ధరల సవరణ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త స్టాంప్ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొత్త సవరణ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇందులో మహిళల సాధికారతను ప్రోత్సహించే దిశగా.. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వెల్లడించారు. పాత అపార్ట్‌మెంట్స్ రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని, వాటికి స్టాంప్ డ్యూటీలో వెసులుబాటు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899కు సవరణ బిల్లు 2025పై శనివారం సెక్రటేరియేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రివ్యూ చేశారు. సీఎం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, లా సెక్రటరీ తిరుపతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సాధారణ ప్రజలకు నష్టం కలగకుండా, వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా ఇండియన్స్టాంప్ యాక్ట్ తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
విమర్శలకు తావులేకుండా ఉండాలి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో 4 సెక్షన్లు, 26 ఆర్టికల్స్‌ను సవరించేందుకు శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి.. కేంద్ర సర్కారు ఆమోద ముద్రకోసం పంపిందని మంత్రి పొంగులేటికి అధికారులు చెప్పారు. అయితే, ఈ బిల్లుపై కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ.. 2023 జనవరిలో ఈ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించిందని వివరించారు. దీంతో అప్పుడు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకొని.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని మంత్రి సూచించారు.
సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని, నిబంధనలు కట్టుదిట్టమైన రూపంలోకి తీసుకురావడం, కొత్త ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడం లక్ష్యంగా బిల్లును రూపొందించాలన్నారు. అలాగే, పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది? అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది? తదితర అంశాలపై స్టడీ చేయాలని ఆదేశించారు.