జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలు పెంచుతం

జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలు పెంచుతం
  • ఈ విషయం మరోసారి సీఎం దృష్టికి తీస్కపోతా: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఈ విషయాన్ని మరోసారి సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేస్తూ నెలవారీగా మందులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. 

బంజారాహిల్స్ కొమ్రం భీం భవన్ లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికులకు హెల్త్​కిట్స్​అందజేశారు. అనంతరం ​మాట్లాడుతూ.. తక్కువ జీతంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ‘మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం మీ అందరి జీతాలు పెంచాలనుకుంటోంది.. మీ పిల్లల చదువులకు ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి.. 

గురుకులాల్లో సీట్లు ఇచ్చి చదివించే బాధ్యత మాది’ అని పారిశుధ్య కార్మికులకు హామీ ఇచ్చారు. అద్దం లెక్క హైదరాబాద్ ను ప్రపంచానికి చూపెడుతున్నారని,  హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు కారణం పారిశుధ్య కార్మికులేనని కొనియాడారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, చీఫ్ మెడికల్ఆఫీసర్  డాక్టర్ పద్మజ, డీఎంహెచ్​వో డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.

పొరపాట్లకు తావు లేకుండా బోనాల ఏర్పాట్లు..

అంబర్​పేట : జంట నగరాల్లో 3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గతేడాది జరిగిన పొరపాట్లు రిపీట్​ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన అంబర్​పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగకు సంబంధించి వివిధ ఆలయాలకు చెక్కులు పంపిణీ  చేశారు. అనంతరం అధికారులతో సమీక్షించారు.