
- బల్దియా కార్మికులను..పర్మినెంట్ చేయాల్సిందే
- జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో ఏకగ్రీవ తీర్మానంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల డిమాండ్
- ప్రోటోకాల్ విషయంలో అధికారులపై మేయర్ సహా అన్ని పార్టీల కార్పొరేటర్లు ఫైర్
- లంచ్ బ్రేక్ కు ముందే సభను నిరవధిక వాయిదా వేసిన మేయర్
- ఎందుకు వాయిదా వేశారో చెప్పాలంటూ ప్రతిపక్ష కార్పొరేటర్ల ధర్నా.. అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం జరిగిన కౌన్సిల్ మీటింగ్ అర్ధాంతరంగా ముగిసింది. బల్దియా ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిందేనంటూ బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో కౌన్సిల్ మీటింగ్ మొదలవగా.. ఎజెండాలో పెట్టిన అంశాల్లో సగం కూడా చర్చకు రాకుండానే లంచ్ బ్రేక్‌కు ముందే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను నిరవధిక వాయిదా వేశారు. ఎలాంటి కారణం లేకుండా సమావేశాన్ని వాయిదా వేయడంపై ప్రతిపక్ష కార్పొరేటర్లు మండిపడ్డారు. సభ్యులంతా సహకరించినా మేయర్ సభను నడిపేందుకు రెడీగా లేరంటూ ఆమె చాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.
మేయర్ బయటికి రాకపోవడంతో ప్రతిపక్ష కార్పొరేటర్లు చాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లి కమిషనర్ రోనాల్డ్ రోస్ చాంబర్ ముందు నిరసన తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు హెడ్డాఫీసు లోపల నుంచి బయటకు తీసుకెళ్లారు. హెడ్డాఫీసు ముందు సైతం బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉదయం 10.46 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కాగా.. బల్దియా ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనే అంశంపై వాడీవేడిగా చర్చ సాగింది. ఔట్ సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్ అంశంపై చర్చించాలని ముందుగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టగా.. మేయర్ ఒప్పుకోలేదు.
దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు.. మేయర్ పోడియం వద్ద అరగంట పాటు నిరసనకు దిగారు. అనంతరం చర్చకు అంగీకరించిన మేయర్.. అన్ని పార్టీల సభ్యులు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. బీజేపీ కార్పొరేటర్ వంగ మధూసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, ఎంఐఎం నుంచి సలీం బేగ్ మాట్లాడుతూ.. బల్దియాలో ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, నాలాలు, శానిటేషన్ తదితర సమస్యలపై ప్రశ్నించారు. ఈ విషయంపై కమిషనర్ వివరణ ఇవ్వాలని మేయర్ కోరగా.. సమావేశంలో చర్చించిన విధంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళతామని ఆయన సమాధానమిచ్చారు.
కార్యక్రమంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈఎన్సీ జియాఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు స్నేహా శబరీష్, జయరాజ్ కెనడి, చంద్రారెడ్డి, కృష్ణ, ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ సీఈ దేవా నంద్, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ కుమార్, జోనల్ కమిషనర్లు వెంకటేశ్, రవికిరణ్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రోటోకాల్ రగడ..
అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. కార్పొరేటర్లతో పాటు మేయర్ సైతం జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ అంశాన్ని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి లేవనెత్తారు. సభ్యులందరికీ ఈ సమస్య ఉందన్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తన డివిజన్‌లో వాటర్ బోర్డు పనులు చేపట్టగా శిలాఫలకంలో తన పేరు కూడా లేదని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా ఎమ్మెల్యేలతో సమస్య ఉంటే.. వారితో తాను మాట్లాడతానని, ప్రోటోకాల్ ఇష్యూపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని మేయర్ తెలిపారు. ప్రొటోకాల్ అంశంపై తొందరలోనే రివ్యూ చేస్తానని, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కార్పొరేటర్ పేరు ఉండాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ విషయంపై వాటర్ బోర్డు అధికారి స్వామి సమాధానమిస్తూ.. డివిజన్ స్థాయిలో అంతర్గత పాలిటిక్స్ వల్ల అధికారులు సరిగా పనిచేయలేకపోతున్నారని మేయర్‌కు వివరించారు.
సగం అంశాలు కూడా చర్చకు రాలే..
దాదాపు 42 అంశాల ఎజెండాతో మొదలైన కౌన్సిల్ మీటింగ్‌లో 24 అంశాలపై మాత్రమే చర్చ జరిగింది. ఉదయం 10-:36 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సగం అంశాలు కూడా చర్చకు రాకుండానే లంచ్ బ్రేక్‌కి మందుగానే మేయర్ సభను నిరవధిక వాయిదా వేశారు. ఎలాంటి కారణం లేకుండా సమావేశాన్ని వాయిదా వేయడంపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. మేయర్, కమిషనర్ చాంబర్ల వద్ద నిరసన తర్వాత హెడ్డాఫీసు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది.
మీడియాపై ఆంక్షలు..
కౌన్సిల్ హాల్లోని మీడియా గ్యాలరీలోకి జర్నలిస్టులకు అనుమతి నిరాకరించారు. దీంతో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వారికి మద్దతు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఇదే విధంగా మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో జర్నలిస్టులు మేయర్ చాంబర్ ముందు బైఠాయించి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తర్వాతి సమావేశాలకు అనుమతించారు. అయితే, బుధవారం జరిగిన సమావేశానికి మళ్లీ మీడియాను అనుమతించ లేదు. మేయర్, అధికారులు కావాలనే ఇలా చేశారని, మీడియా హక్కులను కాపాడాల్సిన బాధ్యతను మరిచిపోవద్దని జర్నలిస్టులు
మండిపడ్డారు.
స్ట్రీట్ లైట్లు ఎప్పుడు వెలుగుతున్నయో తెలుస్తలే
సిటీలో స్ట్రీట్ లైట్లు ఎప్పుడు వెలుగుతయో.. ఎప్పుడ్ బంద్ అయితయో తెలియడం లేదని సభ్యులు మండిపడ్డారు. ఇదే అంశంపై పత్తర్‌గట్టి ఎంఐఎం కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ మాట్లాడుతూ.. చార్మినార్ కమాన్లలోనూ లైట్లు వెలగడం లేదన్నారు. మరికొందరు సభ్యులు మాట్లాడుతూ.. కరెంట్ పోల్స్ ఇవ్వడానికి ఆరు నెలలు పడుతోందని, వీటిని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుందా లేదా ఎలక్ట్రిసిటీ అధికారాలా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కమిషనర్ రోనాల్డ్ రోస్ సమాధానమిస్తూ.. స్ట్రీట్ లైట్లను మెరుగుపరచడంతో పాటు పిన్ పాయింట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని.. కార్పొరేటర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా ప్రాంతాలను పర్యటించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. స్ట్రీట్ లైట్ల రీప్లేస్ మెంట్ కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోజుకు 600 నుంచి వెయ్యి లైట్ల ఫిట్టింగ్ చేస్తున్నామన్నారు. చార్మినార్ ప్రాంతంలో సుందరీకరణ, ఆధునిక స్ట్రీట్ లైట్ల ఏర్పాటుపై కులి కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని కమిషనర్ రోనాల్డ్ రోస్ వివరించారు.
ఒక్క సమావేశాన్ని సరిగా నిర్వహించలే
కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క సమావేశాన్ని సరిగా నిర్వహించడం లేదని, ఇప్పుడు అన్ని అంశాలపై చర్చిద్దామంటే మధ్యలోనే సభను వాయిదా వేశారని మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మండిపడ్డారు. డివిజన్లలో అనేక సమస్యలతో జనం ఇబ్బందిపడుతున్నారని, దీనికి మేయర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమావేశాన్ని ఎలా వాయిదా వేస్తారన్నారు. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ.. గత రెండు సమావేశాల్లో తాను సమస్యలను లేవనెత్తుదామని ఎంతో ప్రిపేర్ అయి వస్తున్నప్పటికీ తనకు మాట్లాడేందుకు అవకాశం రాకుండానే సమావేశం వాయిదా పడుతోందన్నారు.
ఓల్డ్ సిటీలో నాలా పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ రహమత్ బేగ్
నాలా పనులకు సంబంధించి ఎమ్మెల్సీ రహమత్ బేగ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో ఎస్ఎన్డీపీ పనులు నత్తనడకన జరుగుతున్నాయని, జనాలకు ఇబ్బంది లేకుండా వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ విభాగానికి 2 వేల కోట్ల విలువైన పనులు మంజూరు అయ్యాయని, నిధులు లేక పనులు ప్రారంభం కాలేదన్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి పాత బస్తీ వాసులకు వరద నుంచి విముక్తి కల్పించాలని కోరారు.
మురుగును స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్‌లో కలుపుతున్నారు: కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి
మహేశ్వరం సెగ్మెంట్లో సీవరేజ్‌ను స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్‌లో(వరద నీటి డ్రెయిన్) కలుపుతున్నారని.. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చంపాపేట బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎగువ నుంచి వచ్చే వరదతో చంపాపేట, గడ్డి అన్నారం, శంకరమ్మ గార్డెన్ వద్ద జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. లింగోజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. 3 నుంచి 4 మీటర్ల వెడల్పుతో బాక్స్ డ్రెయిన్ పనులు చేపట్టడం వల్ల రోడ్డు దెబ్బతిన్నదని, వెంటనే రిపేర్లు చేపట్టాలన్నారు.