స్ట్రీట్ వెండర్స్ గుర్తింపులో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం

స్ట్రీట్ వెండర్స్ గుర్తింపులో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం
  • గతంలో 2 లక్షలున్నారని చెప్పిన సర్కారు
  •  32 వేల మందినే గుర్తించిన జీహెచ్ఎంసీ
  •  మరో 55 వేలు ఉండొచ్చంటున్న అధికారులు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని తీరుగా తయారైంది స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన చిరువ్యాపారులను ఆత్మ నిర్భర్ అభియాన్ స్కీమ్​తో ఆదుకునేందుకు కేంద్రం రెడీగా ఉన్నా అర్హులను గుర్తించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సిటీలో వీధి వ్యాపారులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారనే డీటెయిల్స్ జీహెచ్ఎంసీ దగ్గర లేకపోవడంతో లోన్ల మంజూరుకు లేట్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు పొంతన లేని లెక్కలతో దాదాపు లక్షమంది ఈ స్కీమ్​కు దూరమయ్యే స్థితి నెలకొంది.

అధికారుల హడావిడి

హైదరాబాద్​లో తోపుడు బండ్లు, చిరు వ్యాపారాలతో 2 లక్షలకు పైగా స్ట్రీట్ వెండర్స్ ఉపాధి పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే గతంలో యునెస్కోకు తెలిపింది. వీరంతా సిటీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నట్టు రిపోర్ట్​లో పేర్కొంది. వెజిటబుల్స్, పూలు, పండ్లు, కొబ్బరి బొండాలు, టీ స్టాళ్లు, ఫుడ్, స్నాక్స్, జ్యూస్ సెంటర్లు, ఫుట్ పాత్​పై బట్టలు, సీజనల్ బిజినెస్​లు చేస్తున్న వాళ్లంతా 3 నెలల లాక్ డౌన్​తో ఆర్థికంగా దెబ్బతిన్నారు. అందులో చాలామంది ఎక్కువ వడ్డీకి డైలీ, వీక్లీ ఫైనాన్స్ తీసుకుని వ్యాపారం చేస్తున్నవారే. వారికి చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’లో భాగంగా లోన్లు మంజూరు చేయనుంది. అందుకు బల్దియా స్ట్రీట్ వెండర్స్​ను గుర్తించాల్సి ఉంది. కాగా, జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్​మెంట్ విభాగం వద్ద స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది ఉన్నారనే లెక్కలు లేకపోవడం విడ్డూరం. తీరా ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికకు హడావిడి చేస్తున్నారు. యూసీడీ, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యాపారులను గుర్తిస్తున్నారు. జులై 1 నుంచి లోన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని పైకి చెప్తున్నా, లబ్ధిదారుల సర్వే మాత్రం పూర్తికాలేదు. గతంలో గుర్తింపు కార్డులు జారీ చేసిన 25 వేల మందికి అదనంగా మరో 7వేల మందిని గుర్తించారు. మొత్తంగా 32 వేల మందిని మాత్రమే స్ట్రీట్ వెండర్స్ గా తేల్చారు. మరో 55 వేల మంది దాకా ఉండొచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్​ లోకేశ్ కుమార్ చెప్తున్నారు.

ప్రాసెస్,మంజూరు ఇలా..

స్ట్రీట్ వెండర్స్ సర్వే డీటెయిల్స్​ను జీహెచ్ఎంసీ అధికారులు మెప్మా వెబ్​సైట్​లో అప్​లోడ్ చేస్తారు. బ్యాంకు, ఆధార్ కార్డ్, బిజినెస్, ఏరియా వంటి వివరాలు అందులో పేర్కొంటారు. స్ట్రీట్ వెండర్స్ కి ఐడీ కార్డులు ఇచ్చి, బ్యాంకర్లకు అటాచ్ చేస్తారు. అందుకోసం సర్కిల్ స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం లబ్ధిదారుల్ని ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. అందులో కేంద్రం రాయితీ కూడా ఇస్తుంది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్, రెగ్యులర్ పేమెంట్లను పరిగణనలోకి తీసుకుని రాయితీ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. బల్దియా అధికారులు సర్వే ఇప్పటికే పూర్తి చేసి, మెప్మా ఆఫీసర్లకు సమర్పించి ఉంటే లోన్లు త్వరగా మంజూరు అయ్యేవి.

కొత్తగా 7వేల మంది

స్ట్రీట్ వెండర్స్ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. 9 రోజుల్లో సర్వే పూర్తవుతుంది. కొత్తగా 7 వేల మందిని గుర్తించాం. ఇతర రాష్ట్రాలకు చెందిన 3 వేల మంది సొంతూళ్లకు వెళ్లిపోయినట్లు సర్వేలో తేలింది. కరోనా కారణంగా వ్యాపారుల గుర్తింపు నిబంధనల్ని కేంద్రం సడలించింది. గతంలో గుర్తింపు కార్డులు అందుకున్న 25 వేల మందిలో చాలామంది నుంచి ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోలేదు. అన్ని కంప్లీట్ అయ్యాక ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తాం.

– డీఎస్ లోకేశ్ కుమార్,జీహెచ్ఎంసీ కమిషనర్

 

అర్హులందరినీ గుర్తించాలె

స్ట్రీట్ వెండర్స్ పరిస్థితులు, ప్రాబ్లమ్స్​పై ప్రోగ్రామ్స్ కండెక్ట్ చేస్తుంటాం. సిటీలో 2 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. బల్దియా మాత్రం 25 వేల మందికే ఐడీ కార్డులు ఇచ్చింది. వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. గతంలోనే సమగ్రంగా సర్వే చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పటికైనా అర్హులందరి లెక్క తేల్చాలి.

 – మజర్ హుస్సేన్, కోవా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి