
కొల్లాపూర్, వెలుగు: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా టార్ఫాలిన్ కవర్లు అందించినప్పటికీ మార్కెట్ యార్డు సిబ్బంది రైతులకు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి మార్కెటింగ్ డైరెక్టర్, కలెక్టర్ భగవత్ సంతోష్ తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా మార్కెట్ సెక్రటరీ అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సెక్రటరీకి ఫోన్‌చేసి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేసి ధరతో పాటు పూర్తి వివరాలతో కూడిన రశీదు ఇవ్వాలన్నారు. అధికారులంతా రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
రైతులను వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెంట్లవెళ్లి మండలం పరిధిలోని జటప్రోల్ గ్రామంలో ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్యం తడిసిన ధాన్యాన్ని వెంటనే కోనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై బేటాయించి ధర్నా చేశారు. కార్యక్రమంలొ సింగిల్ విండో చైర్మన్ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎగ్బాల్, రైతులు పాల్గొన్నారు.