కొత్త పార్టీ పేరును ప్రకటించిన ఆజాద్

కొత్త పార్టీ పేరును ప్రకటించిన ఆజాద్

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. జమ్మూలో ఇవాళ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  ఈవిషయాన్ని ఆయన వెల్లడించారు. హిందుస్థానీ టచ్ ఉండేలా పార్టీకి మంచి పేరును సూచించాలని ప్రజలకు పిలుపునివ్వగా.. దాదాపు 1500 పేర్లను సూచించారని చెప్పారు. వాటిలో నుంచే కొత్త పార్టీ పేరును ఎంపిక చేశామన్నారు. ప్రజాస్వామిక భావజాలం, శాంతియుత దృక్పథం, స్వతంత్రతలను అద్దంపట్టే పేరును ఎంపిక చేశామని చెప్పారు. 

‘జీ 23’ నేతల్లో గులాంనబీ ఆజాద్‌ ఒకరు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో అందుకుగల కారణాలపై  అధిష్ఠానాన్ని ప్రశ్నించిన ‘జీ 23’ నేతల్లో గులాంనబీ ఆజాద్‌ ఒకరు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి అనంతరం పార్టీలో చేపట్టాల్సిన సంస్థాగత మార్పులపై ఆజాద్‌ తీవ్రంగా గళమెత్తారు. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని గులాంనబీ ఆజాద్  చాలా సందర్భాల్లో, చాలా వేదికలపై బహిరంగంగానే కొనియాడారు. ‘‘ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రధాని మోడీ.. తన మూలాలను మర్చిపోలేదు’’ అని ఒకానొక సందర్భంలో జమ్మూలో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో నిర్వహించిన ఆజాద్ వీడ్కోలు కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ.. గులాం నబీ ఆజాద్ పై ప్రశంసల జల్లు కురిపించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.