సోనియానే మా అధ్యక్షురాలు.. నాయకత్వ మార్పు లేదు

సోనియానే మా అధ్యక్షురాలు.. నాయకత్వ మార్పు లేదు
  • సోనియానే మా అధ్యక్షురాలు.. మేమంతా లీడర్లం: ఆజాద్
  • పార్టీ నాయకత్వ మార్పుపై చర్చించలేదన్న రెబెల్ నేత 
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించే మాట్లాడుకున్నామని వెల్లడి

న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ ఒకే పార్టీ. ఆ పార్టీకి సోనియా గాంధీ ఒక్కరే ప్రెసిడెంట్. మేమంతా లీడర్లం’’ అని పార్టీ అసమ్మతి (గ్రూప్ 23) నేతల్లో ఒకరైన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంట్లో ఆమెతో ఆజాద్ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి సోనియానే ప్రెసిడెంట్ గా ఉండాలని ఇటీవల కాంగ్రెస్ వ‌‌‌‌ర్కింగ్ కమిటీ (సీడ‌‌‌‌బ్ల్యూసీ) మీటింగ్ లో నిర్ణయించినందున ఈ సమావేశంలో ఆ విషయం గురించి చర్చించలేదని వెల్లడించారు. పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని సీడబ్ల్యూసీ మీటింగ్ లో సోనియా చెప్పారని, కానీ ఆమెనే ప్రెసిడెంట్ గా ఉండాలని నేతలంతా కోరిన విషయాన్ని గుర్తుచేశారు. వ‌‌‌‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌‌‌‌లకు పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఎలా సిద్ధం కావాలి? ప్రత్యర్థులను ఎలా ఓడించాలన్న అంశంపై మాత్రమే చర్చించామని చెప్పారు. ఈ విషయంపై సోనియాకు పలు సూచనలు చేశానని, అయితే అవి పార్టీ అంతర్గత వ్యవహారం అయినందున బయటకు చెప్పబోనన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారాలంటూ ఇటీవల గ్రూప్ 23 నేతలు కామెంట్లు చేయడం, బుధవారం నుంచి వరుసగా రెండు రోజులు మీటింగ్ లు పెట్టుకోవడంతో సోనియా, ఆజాద్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  ఓటమి తర్వాత.. పార్టీ నాయకత్వంపై జీ23 నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవాలని ఆజాద్ ను సోనియా కోరినట్లు తెలిసింది.