ధరణిలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పనిజేస్తలేదు

ధరణిలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పనిజేస్తలేదు
  • ధరణి పోర్టల్​లో.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పనిజేస్తలేదు
  • 15 రోజులుగా పని చేయని మాడ్యుల్ 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ లో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఉపయోగించే మాడ్యుల్ కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దీంతో తమ పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యుల పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల స్టేట్ డేటా సెంటర్(ఎస్‌డీసీ)లో పవర్ బ్యాకప్ వ్యవస్థకు ఈ నెల 9 నుంచి11 వరకు మరమ్మతులు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మిగతా వెబ్ సైట్లతోపాటు ధరణి పోర్టల్ కూడా నిలిచిపోయింది. పోర్టల్ పునరుద్ధరణ తర్వాత అన్ని సేవలు అందుబాటులోకి వచ్చినా.. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ సర్వీస్​మాత్రం నిలిచిపోయింది. దీంతో పెళ్లయిన కూతుళ్లకు భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారికి, కుటుంబంలో వేరు కాపురాలు పెట్టిన కుమారులకు వ్యవసాయ భూములు పంచి ఇవ్వాలనుకునే వారికి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. స్లాట్ బుక్ చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలకు వెళ్తే  స్లాట్ బుక్ కావడం లేదని సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. 

స్లాట్ బుకింగ్ అయితలేదంటున్నరు.. 
మాకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రెండెకరాల పొలం ఉంది. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లిద్దరి పేరిట భూమి పంచి రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెబితే వాళ్లు స్లాట్ బుక్ చేసేందుకు మీ సేవ సెంటర్ కు వెళ్లిండ్లు. మీ సేవ వాళ్లు స్లాట్ బుక్ కావడం లేదని చెప్పిండ్లట. ఎప్పటి నుంచి పని చేస్తుందో కూడా తెలియదంటున్నరు.  
– ఆనపురం సత్తయ్య, పెద్దవంగర, మహబూబాబాద్