ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల ఇష్టారాజ్యం

ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల ఇష్టారాజ్యం
  • ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల ఇష్టారాజ్యం

  • తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 10 కిలోల పత్తి కట్

  • మామూళ్ల మత్తులో పట్టించుకోని సీసీఐ ఆఫీసర్లు

  • ట్రక్కులు, ఆటోల మీద కూలీలను ఎక్కించి వే బ్రిడ్జి కాంటాలు

  • నిండా మునుగుతున్న రైతులు

ఖమ్మం/ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పంటతో వచ్చినవారిని ముప్పతిప్పలు పెడుతున్నారు. జిన్నింగ్​మిల్లుల్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో.. వారి ఇష్టారాజ్యంగా మారింది. కళ్ల ముందే రైతులను మోసం చేస్తున్నా.. సీసీఐ సిబ్బంది ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.

మిల్లుల ఓనర్లు కొర్రీలు పెట్టి వేధిస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి తుపాను, వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, చేతికందని పంటను అమ్ముకుందామని వస్తున్న రైతులు మిల్లుల్లో దోపిడీకి గురవుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, క్వాలిటీ లేదని, రంగు మారిందని, చెత్త ఎక్కువగా వచ్చిందని ఇలా రకరకాల కారణాలతో రైతుకు మద్దతు దక్కకుండా చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం.. ధర తగ్గిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. 

అక్కడ కూడా నిరాశే

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది లక్షా 40 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ఖమ్మం, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లతోపాటు, పది చోట్ల జిన్నింగ్ మిల్లుల్లోనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్​పత్తిని రూ.6 వేల నుంచి రూ.6,500 మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న మద్దతు ధర రూ.7,020 రైతులకు దక్కడం లేదు. సీసీఐ కేంద్రాల్లోనూ నిరాశే మిగులుతోంది. జిన్నింగ్ మిల్లుల ఓనర్లు రకరకాల కొర్రీలు పెడుతూ..  ట్రాక్టర్​లోడ్ అయితే రెండు క్వింటాళ్ల వరకు, ట్రాలీ ఆటో అయితే ఒకటిన్నర క్వింటాళ్ల తరుగు తీస్తున్నారు. గింజ నాణ్యంగా లేదని, తేమ శాతం 8 కంటే ఎక్కువగా ఉందని, రంగు మారిందని, ఇలా పలు రకాల సాకులు చెబుతున్నారు.

పొద్దున్నే లోడుతో వచ్చిన రైతులను సాయంత్రం వరకు వేచి చూసేలా చేయడం, తర్వాత తక్కువ ధరకే పంట కొనుగోలు చేయడం కామన్​గా మారింది. తరుగు తీసేందుకు ఒప్పుకున్న రైతుల వాహనాలపైకి వేబ్రిడ్జి కాంటా వద్ద తమ సిబ్బందిని ఎక్కించి కాంటా వేస్తున్నారు. అలా కంప్యూటర్​బిల్లు ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. 30 క్వింటాళ్లకు పైగా పత్తి లోడ్​ఉన్న వాహనాలైతే ఇద్దరిని, 20 క్వింటాళ్లకు తక్కువగా ఉంటే ఒక్కరిని ఎక్కిస్తున్నారు. దీంతో యావరేజీగా క్వింటాల్ కు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. తరుగు పేరుతో తగ్గించిన పత్తిని మిల్లర్లు తమకు సన్నిహితులైన వారి పేర్ల మీద రికార్డుల్లో ఎంట్రీ చేస్తున్నారు. అటు రైతులను, ఇటు సీసీఐని కూడా మోసగిస్తున్నారు.

క్వింటాల్​కు 10 కేజీలు తీస్తున్నరు

ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశా. పెట్టుబడి భారీగా పెరిగింది. చేతికందిన పంటకు మార్కెట్​లో మద్దతు ధర ఇవ్వటం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయిస్తే జిన్నింగ్ మిల్లుల ఓనర్లు క్వింటాల్​కు10 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. పత్తి క్వాలిటీ లేదంటూ సాయంత్రం వరకు ఉంచుతున్నారు. చివరికి భారీగా తరుగు తీసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. రెక్కల కష్టం దళారుల పాలవుతోంది.
- స్వామి, రైతు, పమ్మి, ముదిగొండ మండలం 

సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు

జిల్లాలో ఇప్పటి వరకు 41వేల మెట్రిక్​టన్నుల పత్తి కొనుగోలైంది. పది సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర ప్రకారమే రైతుల నుంచి పత్తి కొంటున్నారు. గతేడాది తుపానుతో పత్తి క్వాలిటీపై కొంత ప్రభావం పడింది. సీసీఐ నామ్స్​ ప్రకారం క్వాలిటీ లేని పత్తిని రిజెక్ట్​ చేస్తున్నారు. ఎక్కడైనా కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే.. మా దృష్టికి తీసుకురావచ్చు.
- అబ్దుల్ అలీమ్, ఖమ్మం జిల్లా మార్కెటింగ్ అధికారి