బోగీ - ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకుపోయిన యువతి మృతి

బోగీ - ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకుపోయిన యువతి మృతి

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఇటీవల బోగీ - ప్లాట్‌ఫామ్‌ మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. దువ్వాడలో ఎంసీఏ చదువుతున్న ఆమె.. అన్నవరం నుంచి గుంటూరు - రాయగడ రైల్లో బుధవారం ఉదయం బయల్దేరి దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగే క్రమంలో ప్రమాదం జరిగింది. రైల్వే రెస్క్యూ బృందం ప్లాట్‌ఫామ్‌పై దిమ్మలు తొలగించి.. ఆమెను బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించారు.

ఒక్కగానొక్క కుమార్తె శశికళ త్వరగా కోలుకుని, క్షేమంగా ఇంటికి వస్తుందని ఆమె తల్లిదండ్రులు మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి దంపతులు ఆకాంక్షించారు. కానీ ఇంతలోనే తీరని శోకాన్ని మిగిల్చి శశికళ ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. ఎప్పుడూ చలాకీగా తోటి విద్యార్థులతో కలిసి ఉండే శశికళ మృతి పట్ల ఆమె సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మరణంతో గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. శశికళ మృతదేహాన్ని  ఈ రోజు అన్నవరం తీసుకురానున్నారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ జీఆర్పీ ఎస్సై కె.శాంతారామ్‌ తెలిపారు.