బాల్య వివాహం వద్దంది.. ఎగ్జామ్ లో టాపరైంది

బాల్య వివాహం వద్దంది.. ఎగ్జామ్ లో టాపరైంది

కర్ణాటక ఇంటర్ సెకండియర్ (PUC-2) ఫలితాల్లో సత్తా చాటింది ఓ అమ్మాయి. పరిస్థితులకు ఎదురునిలిచి… చదువుకోవాలని ఆమె చూపించిన తపన… ప్రశంసలు అందుకుంటోంది. హార్డ్ వర్క్ చేసి… కలలు నిజం చేసుకునే దిశగా ఆమె అడుగులు వేస్తోంది.

ఈమె పేరు రేఖ. వయసు 18 ఏళ్లు. కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ లో ఉంటుండేది. పేద కుటుంబంలో పుట్టిన ఆమెకు….. IAS ఆఫీసర్ కావాలనేది కోరిక. చిన్నప్పుడే బాల్యవివాహం చేయాలని పెద్దలు నిర్ణయించడంతో..  ఇంట్లోంచి ఆమె పారిపోయింది. బెంగళూరుకు వెళ్లి ఓ ఫ్రెండ్ సాయంతో.. హెబ్బాల్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరింది. అది తన కెరీర్ కు ఉపయోగపడదని తెలిసి.. కర్ణాటక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హెల్ప్ లైన్ 1098 నంబర్ కు కాల్ చేసి.. తనకు హెల్ప్ చేయాలని కోరింది. అధికారులు ఆమెను బెంగళూరు- మతికెరెలోని స్పర్ష ట్రస్ట్ లో చేర్పించారు. నెలమగల ప్రభుత్వ పీయూ కాలేజీలో సీట్ ఇప్పించారు.

అధికారులు ఇచ్చిన ప్రోత్సాహంతో.. SSLCలో రేఖ 74 శాతం మార్కులు తెచ్చుకుంది. ప్రి-యూనివర్సిటీ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ -2 లోనూ 90.3శాతం మార్కులతో సత్తాచాటింది. ఏప్రిల్ 18న వచ్చిన ఫలితాలతో ఆమె ప్రతిభ బయటపడింది.

హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ చేయాలనుకుంటున్నానని… ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అంటోంది రేఖ. కుటుంబం నుంచి దూరమయ్యానన్న బాధ ఉంది కానీ… చదువుకు ఆటంకం కలగకూడదనే మళ్లీ ఇంటికి వెళ్లదల్చుకోలేదని ఆమె చెబుతోంది.