తల్లిని చంపి.. నాటకమాడిన 15 ఏండ్ల కూతురు

తల్లిని చంపి.. నాటకమాడిన 15 ఏండ్ల కూతురు

నవ మాసాలు మోసి, కని పెంచిన తల్లిని 15 ఏండ్ల వయసున్న కూతురు పొట్టనబెట్టుకుంది. అమ్మ అనే ఆలోచన కూడా లేకుండా  కరాటే బెల్టుతో ఉరేసి హత్య చేసింది. పైగా తనే పోలీసుల దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడడం వల్ల తల్లి మరణిచిందని చెప్పింది. అంతటితో విషయం తప్పుదారి పట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని డ్రామా చేసింది. అక్కడితో అంతా అయిపోయిందనుకున్న సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి ఆమెను అరెస్టు చేయడంతో కథ అడ్డం తిరిగిందని లేటుగా అర్థం తెలుసుకుంది. ఈ ఘటన అంతా మహారాష్ట్ర రాజధాని మంబైలో జరిగింది.

ఫోరెన్సిక్ రిపోర్ట్‌ చూసి షాక్‌ అయిన పోలీసులు

నవీ ముంబైలోని ఐరోలి ప్రాంతంలో చెందిన 15 ఏండ్ల అమ్మాయి జులై 30న రబలె పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. తన తల్లి (40) ప్రమాదవశాత్తు కింద పడి మరణించిందని చెప్పింది. దీంతో పోలీసులు యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఆ పని పూర్తయ్యాక డెడ్‌బాడీని అప్పగించగా, కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే రెండ్రోజుల క్రితం ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో అసలు విషయం బయటపడింది. అందులో ఉన్న విషయాలు చూసి పోలీసుల షాక్ అయ్యారు. బాధిత మహిళ చనిపోయింది ప్రమాదవశాత్తు కాదని, ఆమె కూతురే కరాటే బెల్టుతో గొంతుకు బిగించి హత్య చేసిందని తేలింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆ బాలికను అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకు చంపిందో చెప్పిన కూతురు

ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఆ 15 ఏండ్ల అమ్మాయిని సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు ఏం జరిగిందో చెప్పాలని గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయం అంతా కక్కేసింది. డాక్టర్ చదువులు చదివించాలని తన తల్లికి ఆశ అని, ఆ విషయాన్ని ఎప్పుడూ పదే పదే చెబుతూ ఉండేదని, కానీ అలా ఎంబీబీఎస్ చదవడం తనకు ఇష్టం లేదని పోలీసులకు వివరించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పినా వినలేదని, తనపై పదే పదే ఒత్తిడి తెచ్చేదని, కాదంటే గొడవపడేదని చెప్పుకొచ్చింది. జులై 30న కూడా అలాగే గొడవ జరిగిందని, ఆవేశంలో కరాటే బెల్టుతో ఉరేసి చంపానని ఒప్పుకుంది. 

గతంలో కౌన్సిలింగ్ చేశాం

మొదట యాక్సిడెంటల్‌ డెత్‌గా నమోదు చేసిన కేసును మర్డర్ కేసుగా మార్చామని రబలే పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్టు చేసి, జైలుకు పంపామని చెప్పారు. అయితే చదువు విషయంలో ఇంట్లో రోజూ గొడవ జరుగుతున్న విషయం గత నెలలో ఒకసారి ఆ బాలిక స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ చేసిందని, దీంతో ఆమె కుటుంబసభ్యులను పిలిపించి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు చెప్పారు.