చదువులో అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు

చదువులో అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు

‘బేటీ బచావో.. బేటీ పఢావో’ పథకంతో పురోగతి

చదువుతోనే అమ్మాయిలకు ఆత్మనిర్భరత– కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్

‘‘మీ సామర్థ్యాన్ని, మేథో సంపదను పెంచుకోండి. అదే మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది” మన దేశంలో తొలి మహిళా టీచర్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కూల్​ను ప్రారంభించిన సావిత్రీబాయి పూలే చెప్పిన మాటలు ఇవీ. చదువు ద్వారానే మహిళలకు అన్ని రకాలుగా విముక్తి లభిస్తుందని నమ్మారామె. అంతే కాదు అమ్మాయిలకు సమానమైన, నాణ్యమైన చదువు కోసం జీవితమంతా పోరాటాలు చేశారు. మేథోశక్తిని పెంచుకోవడం ద్వారానే అమ్మాయిలు ఆత్మనిర్భరతకు బాటలు వేసుకోగలరనేది ఆమె సిద్ధాంతం. అమ్మాయిలు చదువుకుంటే వారు స్వయంసమృద్ధి సాధించి సంపద పొందడమే కాక, వారి కుటుంబాలు, సమాజం, జాతి ఆత్మనిర్భరతకూ మార్గం సుగమం అవుతుందని చెబుతూవచ్చారు. దానిని ఆచరించి చూపించారు. ఆమె పోరాటాలు, అమ్మాయిలకు సమానత్వం అనే ఆమె సిద్ధాంతాలకు అనుగుణంగా స్కూళ్లలో అమ్మాయిల భాగస్వామ్యం పెంచడంలో ఎంతో పురోగతి సాధించాం. దీన్ని ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ పథకం సాధించిన విజయంగా చెప్పవచ్చు.

యు-డైస్ 2018–19 లెక్కల ప్రకారం గర్ల్స్​ గ్రాస్​ ఎన్​రోల్​మెంట్​ రేషియో(జీఈఆర్) ప్రైమరీ లెవెల్​లో 101.78 శాతం, ఎలిమెంటరీ స్థాయిలో 96.72 శాతానికి చేరింది. స్కూల్​ ఎడ్యుకేషన్​ నుంచి హయ్యర్​ ఎడ్యుకేషన్​ వరకూ విద్యా శాఖ సరైన విధానాలు అనుసరించడం కూడా జీఈఆర్ పెరగడంలో కీలకమైంది. సెకండరీ ఎడ్యుకేషన్​లో మహిళలకు జాతీయ ప్రోత్సాహకాల పథకం కింద చక్కని ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టడం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) కింద కొత్త స్కూళ్లు తెరవడంతోపాటు పాత బడులను అప్పర్ ప్రైమరీ లెవెల్​ నుంచి సీనియర్ సెకండరీ లెవెల్​కు అప్ గ్రేడ్ చేయడం, గతంలోని మహిళా హాస్టల్ పథకాన్ని అనుసంధానం చేయడం, అమ్మాయిలకు బాత్​రూమ్స్​ నిర్మించడం, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వడం వంటివన్నీ ఈ దిశగా తీసుకున్న కీలక చర్యలు. అలాగే మహిళా స్టడీ సెంటర్లు, సోషల్​ స్టడీస్​లో రీసెర్చ్​ కోసం స్వామి వివేకానంద సింగిల్ ఉమన్ చెయిల్డ్ స్కాలర్ షిప్ ను మేం ప్రవేశపెట్టాం. యూజీసీ ఎనిమిది ప్రీమియర్ విమెన్స్​ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. టెక్నికల్​ ఎడ్యుకేషన్​లో అమ్మాయిల ఎన్​రోల్​మెంట్​ను పెంచడానికి ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్ షిప్ పథకం ప్రవేశపెట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఈఎస్ టీల్లో బీటెక్ ప్రోగ్రాంలో అమ్మాయిల ప్రవేశానికి సూపర్ న్యూమరీ సీట్లు ఏర్పాటు చేయడంతో వారి ఎన్ రోల్ మెంట్ 2016లోని 8 శాతం నుంచి 2018–19 నాటికి 14 శాతానికి పెరిగింది. ఆ తర్వాత 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెరిగింది. గత రెండు విద్యా సంవత్సరాల్లో మొత్తం 3,503 సూపర్ న్యూమరీ సీట్లు పెంచడం జరిగింది.

జెండర్​ ఈక్వాలిటీకి చర్యలు

ఎడ్యుకేషన్​లో అమ్మాయిల భాగస్వామ్యం పెరగడం జెండర్​ ఈక్వాలిటీకి కూడా దోహదపడింది. అయితే కరోనా సంక్షోభంతో ఎడ్యుకేషన్​ సిస్టంలో అమ్మాయిలు, మహిళల భాగస్వామ్యానికి ముప్పు ఏర్పడడం ఆందోళనకరం. స్కూళ్లు మూతపడిన కారణంగా బాలికలపై పెండ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఏర్పడడంతోపాటు సమాజంలో దౌర్జన్యకాండ కూడా పెరిగినట్టు కొన్ని రిపోర్ట్​లు తెలుపుతున్నాయి. ఈ సవాళ్లన్నింటినీ పరిష్కరించేందుకు, అమ్మాయిల ఎడ్యుకేషన్​లో ఇంతవరకు సాధించిన పురోగతి దెబ్బ తినకుండా చూసేందుకు, కరోనా మహమ్మారి టైంలో వారి చదువు కొనసాగేలా చేసేందుకు విద్యా శాఖ ఎన్నో చర్యలు తీసుకుంది. దీక్ష, వాట్సప్, యూట్యూబ్, ఫోన్ కాల్, కాన్ఫరెన్స్ కాల్, వీడియోకాల్, జూమ్ కాన్ఫరెన్స్ వంటి మాధ్యమాల ద్వారా ఈ–లెర్నింగ్ ను ప్రోత్సహించడం, హోంవర్క్ ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం, అమ్మాయిలకు టీచర్లు విద్యా అంశాలపై షార్ట్​ వీడియోలు అందించడం వంటి విభాగాల్లో రాష్ట్రాలు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను. కేజీబీవీల స్వభావాన్ని బట్టి ఈ కరోనా సమయంలో అమ్మాయిలతో నిరంతర కనెక్టివిటీ పెట్టుకోవడం చాలా కష్టమన్న విషయం నాకు తెలుసు. అయినా కూడా కేజీబీవీలు ఆ సవాల్​ను సమర్థవంతంగా అధిగమించాయి. అలాగే ఆ సంస్థలు జిల్లా స్థాయి జెండర్ కో ఆర్డినేటర్లతో వర్చువల్ సమావేశాలు నిరంతరం నిర్వహిస్తూ బాలికల రక్షణ కోసం వివిధ కార్యకలాపాలు చేపడుతూ వారికి మార్గదర్శకం చేశాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు తెరిచిన తర్వాత అమ్మాయిలకు సెల్ఫ్​ డిఫెన్స్​లో ట్రైనింగ్​ ఇవ్వడానికి వీలుగా టీచర్లు, ట్రెయినర్లకు కూడా శిక్షణ ఇచ్చాయి. జెండర్​ ఈక్వాలిటీ చెక్కుచెదరకుండా ఉండేలా చూడడానికి రాష్ట్రాలు చేస్తున్న కృషిని అభినందించి తీరాలి.

డ్రాపౌట్లు తగ్గించడానికి ప్రత్యేక ప్రోగ్రామ్స్

అమ్మాయిల చదువును ప్రోత్సహించే దిశగా మరో అడుగు ముందుకేస్తూ వచ్చే ఏడాది స్కూళ్లలో డ్రాపౌట్లు భారీగా తగ్గించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను నేను ఆదేశించాను. అమ్మాయిల డ్రాపౌట్లను తగ్గించడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. నిరంతరం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల బాలికల చదువు కొనసాగడంతోపాటు జెండర్​ ఈక్వాలిటీకి ప్రాధాన్యత పెరుగుతుంది. నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ సిఫారసులకు అనుగుణంగా స్కూళ్ల క్వాలిటీ(12వ గ్రేడ్ వరకు) పెంచడానికి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను పటిష్టం చేసి విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అమ్మాయిలకు సమానతతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్​ ను అందించే సామర్థ్యాలను పెంచడానికి కేంద్రం జాతీయ స్థాయిలో ‘జెండర్ ఇంక్లూజన్ ఫండ్’ను ఏర్పాటు చేయనుంది. అమ్మాయిలు ఉన్నత చదువులు చదవడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ఫండ్ ద్వారా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ‘చదువుతోనే జీవితానికి ఆత్మనిర్భరత’ అన్న సావిత్రీ బాయి పూలే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజన్ ను వాస్తవ రూపంలోకి తేవడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. స్కూళ్లలో ఎన్​రోల్​మెంట్​ను పెంచడానికే పరిమితం కాకుండా అమ్మాయిల ఎడ్యుకేషన్​ మరింత విస్తృత లక్ష్యంతో సాగేలా చూడడం చాలా అవసరం. స్కూళ్లలో చదవడమే కాదు అక్కడే తమకు భద్రత అని అమ్మాయిలు భావించేలా చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు సామాజిక భావోద్వేగ, జీవన నైపుణ్యాలపై కూడా మేం దృష్టి సారించాల్సి ఉంది. అమ్మాయిలు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకుని సొంత కాళ్లపై నిలబడేలా వారిని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం.