స్కూళ్లకు అబ్బాయిలు, మగ టీచర్లే.. అమ్మాయిలకు నో ఎంట్రీ

స్కూళ్లకు అబ్బాయిలు, మగ టీచర్లే.. అమ్మాయిలకు నో ఎంట్రీ

అఫ్గానిస్తాన్‌లో ఇప్పటికే ప్రైమరీ స్కూల్స్, యూనివర్సిటీలు రీఓపెన్ కాగా, శనివారం హైస్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. అయితే, హైస్కూల్స్ కు అబ్బాయిలు, మగ టీచర్లు మాత్రమే తిరిగి హాజరు కావాలంటూ తాలిబాన్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు, లేడీ టీచర్ల విషయాన్ని ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో శనివారం అబ్బాయిలు, మగ టీచర్లతోనే హైస్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ప్రైమరీ స్కూల్స్ లో మగపిల్లలు, ఆడపిల్లలకు వేర్వేరుగా క్లాసులను స్టార్ట్ చేసిన తాలిబాన్ ప్రభుత్వం.. యూనివర్సిటీల్లోనూ అబ్బాయిలు, అమ్మాయిలు కలవకుండా స్ట్రిక్ట్ రూల్స్ తో క్లాసులను ప్రారంభించింది. దీంతో ఈసారి హైస్కూల్​లో గర్ల్ స్టూడెంట్ల పరిస్థితి ఏంటన్నది క్వశ్చన్ మార్క్​గా మారింది. 

గర్ల్స్ భవిష్యత్తుపై యునిసెఫ్ ​ఆందోళన

అఫ్గాన్​లో గత ఇరవై ఏండ్లలో అమెరికా మద్దతుతో నడిచిన ప్రభుత్వాల హయాంలో విద్యా సంస్థల్లో బాలికల సంఖ్య దాదాపు రెట్టింపుగా పెరిగి 30 శాతానికి చేరింది. ఎంతో మంది మహిళలు లాయర్లు, జడ్జిలు, పోలీస్ ఆఫీసర్లు, పైలట్లు అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆంక్షలు షురూ చేయడంతో బాలికలకు విద్యా హక్కు దూరమవుతుందోంటూ యునిసెఫ్​ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘టీనేజ్ అమ్మాయిలతో సహా బాలికలు, మహిళలందరి హక్కులను కాపాడాలి. ఎలాంటి ఆలస్యం చేయకుండా, అందరికీ చదువుకునే అవకాశం కల్పించాలి. ఇందుకోసం లేడీ టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని యునిసెఫ్ ​కోరింది.