- పశ్చిమ బెంగాల్ సభలో అమిత్‌షా
 - సీఎం మమతా బెనర్జీపై విమర్శలు
 
కల్యాణి: దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న వారితో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దోస్తీ కట్టారని బీజేపీ చీఫ్ అమిత్‌షా విమర్శించారు. బన్గావ్ లోక్‌సభ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షా మమతాపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాశ్మీర్‌పై పోరాటం ఆగదని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తమను 30 సీట్లల్లో గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. “ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారితో దీదీ దోస్తీ కట్టారు. ఇండియాకు ఇద్దరు ప్రధానులు కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా చేసిన కామెంట్స్‌పై మమత స్పందించాలి. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెట్టి అర్హులైన శరణార్థులకు సిటిజన్ షిప్ ఇస్తాం. చొరబాటుదారులందరినీ బయటికి గెంటేస్తాం” అని అమిత్‌షా చెప్పారు.
