మా జీఎస్టీ వాటా ఇవ్వండి

మా జీఎస్టీ వాటా ఇవ్వండి

న్యూఢిల్లీ,  వెలుగు: జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాల వాటాను త్వరలో విడుదలచేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సోమవారం వెల్లడించారు. గడిచిన 3 నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్షా మూడువేల కోట్ల నుంచి లక్షా పదివేల కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని 2 విడతల్లో, కార్పొరేషన్, ఆదాయ శాఖ పన్నులను 3 విడతలుగా చెల్లిస్తామని మంత్రి చెప్పారు. సోమవారం లోక్​ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, వైఎస్ఆర్​సీపీ ఎంపీ వంగ గీత ప్రశ్నలకు జవాబిస్తూ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. జీఎస్టీపై నెలకొన్న సందిగ్ధతకు ఎప్పటిలోగా పరిష్కారం చూపుతారన్న ప్రశ్నకు జవాబిస్తూ.. జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా పెరుగుతున్నాయని ఠాకూర్​ చెప్పారు.

2017 నుంచి జీఎస్టీ అమలుకాగా ఇప్పటివరకూ జీఎస్టీ పరిహారం కింద అన్ని రాష్ట్రాలకు క‌‌లిపి రూ 2,10,969  కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.  గతేడాది అక్టోబర్‌‌ నవంబర్‌‌కు సంబంధించిన జీఎస్టీ చెల్లింపులు బకాయి పడ్డాయని చెప్పారు. 2 నెలలకు కలిపి ఒకసారి జీఎస్టీ చెల్లింపులు చేపడుతున్నామన్నారు. 2019 సెప్టెంబర్‌‌వరకూ బకాయిల చెల్లింపులను ఇప్పటివరకూ పూర్తిచేశామన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ… జీఎస్టీ నిధులను రాష్ట్రాలకు ఆలస్యంగా విడుదలచేయడం వల్ల రాష్ట్ర పథకాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. తెలంగాణ తో పాటూ, పలు రాష్ట్రాలు జీఎస్టీ నిధుల ఆలస్యంపై అసంతృప్తిలో ఉన్నాయని చెప్పారు.

మరన్ని వార్తల కోసం..