
కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలంటూ కొత్త జంటలకు పిలుపునిచ్చారు స్టాలిన్. వ్యాపారాల పేర్ల విషయంలో కూడా తమిళ భాషకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు స్టాలిన్. ఎప్పుడైనా పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు దంపతులకు పుట్టబోయే బిడ్డకు అందమైన తమిళ పేరు పెట్టమని సూచిస్తున్నానని అన్నారు స్టాలిన్.
తమిళనాడులో పుట్టి తమిళనాడులోనే జీవిస్తున్న మనం కూడా తరచూ ఉత్తర భారతీయ పేర్లు, ఇంగ్లీష్ పేర్లు ఎంచుకుంటున్నామని.. ఈ వరవడి ఆగాలని అన్నారు స్టాలిన్. ఇకపై పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని అన్నారు. వ్యాపారస్తులు కూడా తమ దుకాణాలను పిల్లలుగా భావిస్తారు కాబట్టి.. దుకాణాలకు తమిళ పేర్లు మాత్రమే పెట్టాలని అన్నారు స్టాలిన్. ఒకవేళ పేరు ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ కనీసం తమిళంలో రాయాలని అన్నారు స్టాలిన్.
తమిళనాడు నాయకుల నుండి తనకు వచ్చిన లేఖలను ప్రస్తావిస్తూ, తమిళ భాషపై తమకు గౌరవం ఉందని చెప్పినప్పటికీ, ఎవరూ తమిళంలో సంతకం చేయలేదని అన్నారు. తమిళ భాష పట్ల గౌరవం ఉంటే.. ప్రతి ఒక్కరూ కనీసం తమిళంలో సంతకం చేయాలంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు స్టాలిన్.