Cricket World Cup 2023: ఆసీస్ బ్యాటర్ల విధ్వంసం.. నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యం

Cricket World Cup 2023: ఆసీస్ బ్యాటర్ల విధ్వంసం.. నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యం

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా గాడిలో పడింది. భారత్, దక్షిణాఫ్రికాపై ఓడి విమర్శలు మూటగట్టుకున్న ఆసీస్.. ఆ తర్వాత ఒక్కసారిగా  జూలు విదిల్చింది. వరుసగా శ్రీలంక, పాకిస్థాన్ పై  రెండు విజయాలు నమోదు చేసుకున్న కంగారూలు ప్రస్తుతం మూడో విజయంపై కన్నేశారు.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించి భారీ స్కోర్ చేశారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (9) ఔటైనా  దూకుడు తగ్గలేదు. మరో ఓపెనర్ వార్నర్.. స్మిత్, లబుషేన్ లతో భారీ భాగస్వామ్యాలు నెలకొప్పాడు. ఈ క్రమంలో వార్నర్ 104 పరుగులు చేసి ఈ టోర్నీలో తన రెండో సెంచరీ నమోదు చేసుకుంటే స్మిత్ (71),లబుషేన్(62) అర్ధ సెంచరీలతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఇక చివరి 10 ఓవర్లలో మ్యాక్స్ వెల్ విధ్వంసం కొనసాగింది. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్లుగా మ్యాక్సీ ఆట సాగింది. 

మొత్తం 44 బంతుల్లోనే 106 పరుగులు చేసి ఆసీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాక్స్ వెల్ 40 బంతుల్లోనే వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి సౌత్ ఆఫ్రీకా బ్యాటర్ మార్కరం(49) రికార్డ్ బ్రేక్ చేసాడు. మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయంటే అతని విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బెక్ నాలుగు వికెట్లు తీసుకోగా.. బేస్ డీ లీడ్ కు రెండు వికెట్లు దక్కాయి.