మ్యాక్స్‌‌వెల్ మెరుపు సెంచరీ .. 223 రన్స్ ఛేజ్‌‌ చేసిన ఆసీస్

 మ్యాక్స్‌‌వెల్ మెరుపు సెంచరీ ..  223 రన్స్ ఛేజ్‌‌ చేసిన ఆసీస్

గువాహతి :  టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (57 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 నాటౌట్‌‌‌‌) దుమ్మురేపాడు. తన పవర్, టెక్నిక్‌‌‌‌ను చూపెడుతూ టీ20 ఫార్మాట్‌‌‌‌లో తొలిసారి సూపర్ సెంచరీతో చెలరేగి టీమ్‌‌‌‌కు భారీ స్కోరు అందించాడు. కానీ, ఏం లాభం. గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్ (48 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్) వీరబాదుడుకు 223 రన్స్ టార్గెట్‌‌‌‌ను ఇండియా కాపాడుకోలేకపోయింది.  మంగళవారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. 

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌‌‌‌లో 1–2తో రేసులోకి వచ్చింది. ఈ హైస్కోరింగ్ పోరులో  తొలుత ఇండియా 20 ఓవర్లలో 222/3 స్కోరు చేసింది.  సూర్యకుమార్ (39), తిలక్ వర్మ (31 నాటౌట్) ఆకట్టుకున్నారు.  అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 225/5 స్కోరు  చేసి గెలిచింది.  మాథ్యూవేడ్ (16 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 28 నాటౌట్) సత్తా చాటాడు. ఇండియా బౌలర్లలో రవి బిష్ణోయ్​ 2 వికెట్లు పడగొట్టాడు.  మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌  ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ గా నిలిచాడు. నాలుగో టీ20 గురువారం రాయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.

మ్యాక్స్‌‌‌‌వెల్ తుఫాన్

హిట్టర్ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించడంతో భారీ టార్గెట్‌‌‌‌ను ఆసీస్‌‌‌‌ ఆఖరి బాల్‌‌‌‌కు అందుకుంది. ఛేజింగ్‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌కు మంచి ఆరంభమే లభించింది. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ (35), ఆరోన్​ హార్డీ (16) తొలి వికెట్‌‌‌‌కు 47 రన్స్ జోడించారు. కానీ, వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టిన ఇండియా బౌలర్లు ఆ టీమ్‌‌‌‌ జోరుకు బ్రేక్‌‌‌‌ వేశారు. తొలుత పేసర్ అర్ష్‌‌‌‌దీప్ ఔట్ స్వింగర్‌‌‌‌‌‌‌‌తో హార్డీని ఔట్‌‌‌‌ చేయగా.. అవేశ్​ స్లో బాల్‌‌‌‌తో ట్రావిస్ పని పట్టాడు. ఆ వెంటనే స్పిన్నర్ బిష్ణోయ్​ ఇంగ్లిస్​ (10)ను క్లీన్‌‌‌‌ బౌల్డ్ చేయడంతో ఆసీస్‌‌‌‌ 68/3తో నిలిచింది. ఈ దశలో గ్లెన్ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 

ప్రసిధ్ వేసిన ఎనిమిదో ఓవర్లో  రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 రన్స్ రాబట్టి ఆసీస్‌‌‌‌ను రేసులోకి తెచ్చాడు. అతనికి కొద్దిసేపు సపోర్ట్ ఇచ్చిన స్టోయినిస్‌‌‌‌ (17)ను అక్షర్​ ఔట్ చేయగా.. నాలుగు బాల్స్ తర్వాత  టిమ్ డేవిడ్‌‌‌‌ (0)ను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చడంతో 134/5తో ఆసీస్‌‌‌‌ డీలా పడింది.  కానీ, పోరాటం ఆపని మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ ఓ ఫోర్, మూడు సిక్సర్టు కొట్టాడు. చివరి 18 బాల్స్‌‌‌‌లో 49 రన్స్‌‌‌‌ అవసరమైన టైమ్‌‌‌‌లో 18వ ఓవర్లో ప్రసిధ్​6 రన్స్‌‌‌‌ మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్‌‌‌‌లో ఉత్కంఠ రేగింది. అదే ఓవర్లో వేడ్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను సూర్యకుమార్ వదిలేయడం ఇండియాను దెబ్బకొట్టింది. 

అక్షర్​ వేసిన 19వ ఓవర్లో తొలి మూడు బాల్స్‌‌‌‌లో వేడ్ రెండు ఫోర్లు కొట్టగా.. నాలుగో బాల్‌‌‌‌కు అతడిని స్టంపౌట్ చేసేందుకు కీపర్ ఇషాన్ బాల్‌‌‌‌ను వికెట్ల ముందుకొచ్చి కలెక్ట్‌‌‌‌ చేయడంతో అంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఫ్రీ హిట్‌‌‌‌కు వేడ్‌‌‌‌ సిక్స్‌‌‌‌ కొట్టగా.. ఆఖరి బాల్ ఇషాన్ తప్పిదంతో బైగా ఫోర్ వెళ్లింది. దాంతో, ఆఖరి ఓవర్లో ఆసీస్‌కు 21రన్స్‌‌‌‌ అవసరం అవగా ప్రసిధ్​ తొలి బాల్‌‌‌‌ను వేడ్ బౌండ్రీకి చర్చగా, మ్యాక్సీ వరుసగా 6, 4, 4, 4 కొట్టి  టీమ్‌ను గెలిపించి సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.  రెండు ఇన్నింగ్స్‌ ల్లో కలిపి ఈ మ్యాచ్‌లో నమోదైన రన్స్‌. 447 ఇండియా, ఆసీస్‌ మధ్య టీ20లో అత్యధికం.

గైక్వాడ్ ధమాకా

ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆటే హైలైట్. స్టార్టింగ్‌‌‌‌లోనే రెండు వికెట్లు పడ్డా పరిస్థితులకు తగ్గట్టుగా తన గేమ్‌‌‌‌ను మార్చుకుంటూ వెళ్లిన రుతురాజ్ కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు.  ఆరంభంలో మాత్రం ఇండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. గత మ్యాచ్‌‌‌‌లో ఫిఫ్టీలతో మెరిసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6)తో పాటు ఇషాన్‌‌‌‌ కిషన్ (0) నిరాశ పరిచాడు. పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసిన బెరెండార్ఫ్​ తన రెండో బాల్‌‌‌‌కే యశస్విని ఔట్‌‌‌‌ చేసి ఆసీస్‌‌‌‌కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఇషాన్.. స్టోయినిస్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. దాంతో 24/2తో ఇండియా కష్టాల్లో పడగా.. ఎల్లీస్ వేసిన ఐదో  ఓవర్లో తన ట్రేడ్‌‌‌‌ మార్క్ షాట్లతో రెండు సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ ఇన్నింగ్స్‌‌‌‌కు జోష్ తెచ్చాడు. రుతురాజ్‌‌‌‌ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకోగా..  సంఘా, హార్డీ ఓవర్లలో సూర్య రెండేసి ఫోర్లతో అలరించడంతో సగం ఓవర్లకు ఇండియా 80/2తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లోనే హార్డి వేసిన ఊరించే షార్ట్‌‌‌‌లెంగ్త్ బాల్‌‌‌‌కు సూర్య కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. అప్పటికి  21 బాల్స్‌‌‌‌లో 21 రన్స్ చేసిన రుతురాజ్‌‌‌‌.. లెఫ్టాండర్‌‌‌‌‌‌‌‌ తిలక్ తోడైన వెంటనే గేరు మార్చాడు. క్లాసిక్ షాట్లతో వరుస బౌండ్రీలతో అలరించాడు. 32 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన గైక్వాడ్ ఆ తర్వాత టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేశాడు. 

మరో ఎండ్‌‌‌‌లో తిలక్ స్ట్రయిక్‌‌‌‌ రొటేట్ చేస్తూ సపోర్ట్  ఇవ్వగా తను భారీ షాట్లతో రెచ్చిపోయాడు. సంఘా  వేసిన 15వ ఓవర్లో 4,6 కొట్టిన అతను హార్ది వేసిన 18వ ఓవర్లో 6,6,4,6 తో ఏకంగా 25 రన్స్‌‌‌‌ రాబట్టాడు. మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ వేసిన ఆఖరి ఓవర్ తొలి బాల్‌కు సిక్స్‌‌‌‌తో సెంచరీ (52 బాల్స్‌‌‌‌లో) పూర్తి చేసుకున్నాడు. తర్వాతి నో బాల్‌‌‌‌ను  బౌండ్రీకి పంపించిన గైక్వాడ్ చివరి మూడు బాల్స్‌‌‌‌కు 6,6,4  బాదేశాడు. చివరి ఓవర్లో 30 రన్స్‌‌‌‌ రావడంతో టీమిండియా వరసగా మూడో మ్యాచ్‌‌‌‌లోనూ 200  ప్లస్‌‌‌‌ స్కోరు చేసింది. రుతురాజ్‌‌‌‌ తన చివరి 36 బాల్స్‌‌‌‌లో ఏకంగా 102 రన్స్ రాబట్టడం విశేషం. తిలక్‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌కు 59 బాల్స్‌‌‌‌లోనే 141 రన్స్‌‌‌‌ జోడించాడు. 

  • ఈ మ్యాచ్‌‌లో 47 బాల్స్‌‌లో వంద సాధించిన మ్యాక్స్‌‌వెల్‌‌ టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో ప్లేయర్‌‌గా ఆరోన్​ ఫించ్, జోష్​ ఇంగ్లిస్ (47 బాల్స్‌‌) రికార్డు సమం చేశాడు.
  • టీ20ల్లో మ్యాక్స్‌‌వెల్‌‌కు ఇది నాలుగో సెంచరీ. ఈ ఫార్మాట్‌‌లో ఎక్కువ సెంచరీలు చేసిన రోహిత్‌‌ శర్మ సరసన చేరాడు
  • ఈ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ ఇచ్చుకున్న రన్స్. ఒక టీ20 మ్యాచ్‌లో ఎక్కువ రన్స్‌ ఇచ్చిన ఇండియా బౌలర్‌‌గా చహల్ (64)ను అధిగమించాడు.​

సంక్షిప్త స్కోర్లు

ఇండియా : 20 ఓవర్లలో 222/3 (రుతురాజ్ 123 నాటౌట్, సూర్యకుమార్ 39, బెరెండార్ఫ్​1/12). 
ఆస్ట్రేలియా :  20 ఓవర్లలో 225/5 (మ్యాక్స్‌‌‌‌వెల్ 104 నాటౌట్, వేడ్ 35, బిష్ణోయ్ 2/32)