
ముంబై: గ్లోబల్ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది. ముంబైలో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించింది. ఇక్కడ ఇది మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అమ్ముతుంది. దీనిని రూ. 59.89 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, షాంఘైలోని తమ తయారీ కేంద్రం నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీఐ) గా మోడల్ వై ని మనదేశానికి దిగుమతి చేసుకోనుంది.
ప్రపంచంలో ఒకప్పుడు అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన మోడల్ వై, భారత్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. రియర్-వీల్ డ్రైవ్ ధర రూ. 59.89 లక్షల నుంచి మొదలవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు వెళ్తుంది. లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ప్రారంభ ధర రూ. 67.89 లక్షలు. దీని రేంజ్ 622 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు వేరియంట్ల డెలివరీలు వరుసగా 2025 మూడో, నాలుగో క్వార్టర్లో మొదలవుతాయి. తొలుత ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌లలో రిజిస్ట్రేషన్, డెలివరీలు మొదలవుతాయి.
టెస్లా డిజైన్ స్టూడియో ద్వారా కస్టమర్‌లు తమ మోడల్ వై ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లను మార్చుకోవచ్చు. మోడల్ వై భారతదేశంలో మెర్సిడెస్- బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి జర్మన్ ఆటోమేకర్ల నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లతో పోటీపడుతుంది. భారతీయ ఆటో కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలు రూ. 30 లక్షల లోపే లభిస్తున్నాయి. అమెరికాలో మోడల్ వై లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ 37,490 డాలర్లకు (సుమారు రూ. 31 లక్షలు)కు అందుబాటులో ఉంది.