ప్రస్తుతం ప్రపంచం మునుపెన్నడూ చూడని అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ యుద్ధం.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలు, అమెరికాలో ప్రమాదాలు వెరసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో మార్చి నెలలో రోజుకు దాదాపు 8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ షార్టేజీ ఏర్పడిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత సంక్షోభానికి గల ప్రధాన కారణాలను దేశాల వారీగా ఏ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 28న మొదలైన ఉద్రిక్తతలు మార్చి 18-20 మధ్య పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతిచర్యగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది. అంతటితో ఆగని ఇరాన్.. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హార్ముజ్ జలసంధి మార్గాన్ని మూసివేయడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
* ఖతార్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కాంప్లెక్స్ అయిన 'రాస్ లఫ్ఫాన్'పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దీనివల్ల ఖతార్ ఎగుమతి సామర్థ్యం 17% పడిపోయింది. ఇది కోలుకోవడానికి కనీసం 3 నుంచి 5 ఏళ్లు పట్టవచ్చని తేలింది.
* సౌదీ అరేబియా & కువైట్: సౌదీలోని యన్బు రిఫైనరీ, కువైట్‌లోని మీనా అల్-అహ్మదీ వంటి కీలక కేంద్రాలపై డ్రోన్ దాడులు చేసింది ఇరాన్. దీంతో క్రూడ్ ఆయిల్ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రష్యా: ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
తూర్పు యూరప్‌లో ఉక్రెయిన్ తన వ్యూహాన్ని మార్చి రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. మార్చి 21న సరతోవ్ రిఫైనరీని, మార్చి 23న ఉఫా రిఫైనరీ, ప్రిమోర్స్క్ ఆయిల్ టెర్మినల్‌ను ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దాదాపు 300 డ్రోన్లతో జరిగిన ఈ దాడుల వల్ల రష్యా క్రూడ్ నిల్వలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఇది రష్యా నుంచి భారత్ వంటి దేశాలకు వచ్చే చౌక చమురు సరఫరాకు పెద్ద అడ్డంకిగా మారింది.
అమెరికా: టెక్సాస్ రిఫైనరీ ప్రమాదం
భౌగోళిక రాజకీయ కారణాలు కాకపోయినప్పటికీ.. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న భారీ వాలెరో రిఫైనరీలో మార్చి 23న జరిగిన పేలుడు ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. రోజుకు 4లక్షల 35వేల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ మూతపడటంతో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. మెుత్తంగా ప్రపంచంలో క్రూడ్ తయారీకి కేంద్రాలుగా ఉన్న దేశాల్లో అనేక కారణాల కారణంగా తగ్గిన లేదా నిలిచిపోయిన ఉత్పత్తి ఇప్పుడు భారత్ వంటి దిగుమతిపై ఆధారపడే దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. జస్ట్ ఒక్క నెల కూడా వార్ పూర్తి చేసుకోకుండానే పెట్రోల్ నో బోర్డులు కనిపిస్తున్నాయ్ అంటే ఎఫెక్ట్ ఎంత లోతుగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.
