
జాయింట్ వెంచర్లు ఏర్పాటుకు ముందుకొస్తున్న గ్లోబల్ కంపెనీలు: యెస్ సెక్యూరిటీస్ రిపోర్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ కంపెనీలు ఇండియాలో చిప్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సెమికాన్ 2025 సక్సెస్ తర్వాత ఎంఎన్‌సీలు ఇండియన్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయని యెస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. దీని ప్రకారం, కేన్స్ టెక్నాలజీ వంటి సంస్థలు ఇప్పటికే అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్‌పై పని చేస్తున్నాయి.
భారత సెమికండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లకు) కు చేరే అవకాశం ఉంది. ఏడాదికి 13శాతం వృద్ధి చెందుతుందని అంచనా. ఈ వృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, దేశీయ ఎలక్ట్రానిక్స్ డిమాండ్, గ్లోబల్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ప్రధాన కారణాలుగా ఉంటాయని రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికే ఫ్యాబ్, డిస్‌ప్లే యూనిట్లు, ఓసాట్ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) వంటి కార్యకలాపాలకు భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది.
డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డీఎల్‌ఐ) స్కీమ్ ద్వారా దేశీయ చిప్ డిజైన్ స్టార్టప్‌లకు మద్దతు ఇస్తూ, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తోంది. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0 ద్వారా వచ్చే 5 ఏళ్లల్లో అవసరమైన కీలక చిప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టి, పీఎల్‌ఐ, డీఎల్‌ఐ, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ఈఎస్‌డీఎం) వంటి స్కీమ్‌లతో కనెక్ట్ చేయనుంది.
ప్రస్తుతం కెపాసిటర్లు, రెసిస్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీలు), కనెక్టర్లు వంటి ఎలక్ట్రానిక్ భాగాలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 23 చిప్ డిజైన్ ప్రాజెక్టులు, 72 కంపెనీలకు ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ) టూల్స్ యాక్సెస్ ఇచ్చారు. ప్రపంచంలో 20శాతం చిప్ డిజైన్ ఇంజినీర్లు భారత్‌లోనే ఉండటంతో, భారతదేశాన్ని సెమికండక్టర్ డిజైన్ అండ్ ఐపీ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తోంది.