భక్తజన సంద్రంగా బాసర క్షేత్రం

భక్తజన సంద్రంగా బాసర క్షేత్రం
  • భక్తజన సంద్రం.. బాసర క్షేత్రం
  • వేకువ జాము 3 గంటల నుంచే అక్షరభ్యాసాలు షురూ
  • లక్షకు పైగా భక్తుల రాక.. ఇంకా కొనసాగుతున్న రాక
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

నిర్మల్/భైంసా, వెలుగు ; చదువుల తల్లీ బాసర సరస్వతీ క్షేత్రం భక్తజన సంద్రమైంది. గురువారం వసంత పంచమి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున అమ్మవారి జన్మదినాన్ని జరుపుతారు. తెల్లవారు జామున 2గంటల నుంచే పూజలు ఆరంభం కాగా.. 3గంటల నుండి అక్షరభ్యాసాలు జరిగాయి. రాత్రి ఒంటి గంట నుంచే భక్తులు క్యూకట్టారు. లక్షకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోని తమ చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు చేయించారు. అక్షరభ్యాసాలు, పూజలతో ఆలయం పులకించిపోయింది. వెయ్యి రూపాయల అక్షరభ్యాస మండపాలు మూడు, రూ. 150 మండపం ఒకటిలో అక్షరశ్రీకార పూజలు జరిగాయి. మూడు చోట్ల పార్కింగ్లు ఏర్పాటు చేశారు.

రూములు ఫుల్.. భక్తులకు ఇక్కట్లు..

మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూములు దొరకక భక్తులు ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిద్రపోవాల్సి వచ్చింది. చిన్నారులు, వృద్ధులు చలితో ఇక్కట్లు పడ్డారు. ఆలయ ఆఫీసర్లు ముందస్తుగానే వీఐపీలకు గదులు కేటాయించడంతో సాధారణ భక్తులు అసహానం వ్యక్తం చేశారు. ప్రైవేటు లాడ్జిలు ఇదే అదునుగా భావించి గదుల ధరలను ఇష్టారీతిన వసూళ్లు చేశారని భక్తులు పేర్కొన్నారు. 

ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు....

రాష్ట్ర ప్రభుత్వం తరపున సరస్వతీ అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించారు. పద్మాశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన 9గజాల చీరెను అమ్మవారికి సమర్పించారు. భాజభజంత్రిలతో ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు అర్చకులు, ఆఫీసర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆలయాల అభివృద్ధి... మంత్రి ఐకేరెడ్డి

సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ఆలయాలు మరింగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. దేశంలోనే తిరుపతి తర్వాత తెలంగాణలో యాదాద్రిని మొదటి స్థానంలో నిలబెట్టామన్నారు. బాసర క్షేత్రానికి రూ. 50కోట్లను కేటాయించి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రధాన గర్భాలయ విస్తరణ, రాజ గోపురాల ఆధునీకరణ తదితర పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.