
- సమగ్ర స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) కు సమగ్ర స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్ తయారీకి జీహెచ్ ఎంసీకి అనుమతి ఇస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి గురువారం జీవో 391 జారీ చేశారు. జీహెచ్ ఎంసీ ప్రాంతం దాని చుట్టుపక్కల పట్టణ గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉందని, టీసీయూఆర్ తెలంగాణ ఆర్థిక, సామాజిక సాంస్కృతిక కేంద్రంగా ఉన్నందున ఇది కీలకమైన ప్రాంతం అని జీవో లో సెక్రటరీ పేర్కొన్నారు. టీసీయూఆర్ ప్రధాన పరిశ్రమలు, ఐటీ కేంద్రాలు వాణిజ్య కేంద్రాలకు నిలయంగా ఉందని, ఇది అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్ర జీడీపీకి గణనీయంగా దోహదపడుతుందని, రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఈ ఏరియాలో ఉందన్నారు.
మూసీ, ఉపనుదులు ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్నాయని , వీటితో పాటు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు ఉన్నాయని, వరదల నివారణకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా జీహెచ్ ఎంసీ అభివృద్ధికి ఈ సర్వే అవసరమన్నారు. ఈ సర్వేతో స్మార్ట్ డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించటంతో పాటు, గ్రేటర్ కు వరద ముంపు రాకుండా ఉండటానికి పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఈ సర్వేకు టెండర్లు పిలవాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ ను మున్సిపల్ సెక్రటరీ ఆదేశించారు.