Vijay GOAT: వైరల్ అవుతున్న ‘GOAT’ ఐకానిక్ నంబర్ ప్లేట్.. సీఎం విజయ్‌కు డైరెక్టర్ స్పెషల్ గిఫ్ట్!

Vijay GOAT: వైరల్ అవుతున్న ‘GOAT’ ఐకానిక్ నంబర్ ప్లేట్.. సీఎం విజయ్‌కు డైరెక్టర్ స్పెషల్ గిఫ్ట్!

తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ను విష్ చేయడానికి సినీ ప్రముఖులు కలుస్తున్నారు. ఇప్పటికే, తమిళ సినీ స్టార్స్, డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే GOAT డైరెక్టర్ వెంకట్ ప్రభు సీఎం విజయ్ని కలిసి ప్రత్యేక కానుక అందించారు. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేక బహుమతితో వేడుకలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.

GOAT సినిమాలో విజయ్ ఉపయోగించిన ‘TN07 CM 2026’ నంబర్ ప్లేట్‌ను ప్రత్యేక ఫ్రేమ్‌గా రూపొందించి బహుమతిగా అందించారు డైరెక్టర్. వాస్తవానికి సినిమాలో విజయ్ నడిపిన కారుపై కనిపించిన ఈ నంబర్ అప్పట్లోనే అభిమానుల దృష్టిని ఆకర్షించింది. చాలామంది దీన్ని 2026లో విజయ్ రాజకీయ భవిష్యత్తుకు సంకేతంగా భావించారు. ఇందులో ‘TN’ అంటే తమిళనాడు, ‘CM’ అంటే ముఖ్యమంత్రి, ‘2026’అనేది ఎన్నికల సంవత్సరాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ సీఎం కావడంతో, ఆ నంబర్ ప్లేట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఐకానిక్ నంబర్ ప్లేట్..

నలుపు, గోధుమ, రాగి రంగుల కలయికతో రూపొందించిన ఈ స్పెషల్ ఫ్రేమ్‌లో TVK పార్టీ రంగులైన ఎరుపు, పసుపు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించారు. కింద విజయ్-వెంకట్ ప్రభు చేతులు కలిపిన ఫస్ట్ కలయిక ఫోటోతో పాటు, గోల్డ్ ప్లేట్‌పై “VP & Team First Prediction” అని రాశారు. ఈ ప్రత్యేక కానుకను అందుకున్న సీఎం విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో ఊహించిన సన్నివేశం నిజ జీవితంలో వాస్తవంగా మారడంతో ‘గోట్ కల’ నిజమైందని విజయ్ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

నిజానికి GOAT సినిమాలో విజయ్ వాడిన కారుపై ఈ నంబర్ కనిపించగా, అది ఒట్టి ఊహ మాత్రమే అని కొన్నిరాజకీయ వర్గాలు భావించాయి. ఇప్పుడు విజయ్ ఏకంగా భారీ మెజార్టీతో తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో, ఆ నంబర్ ప్లేట్ నిజమైన రాజకీయ ప్రయాణానికి ప్రతీకగా మారింది.

ఈ సందర్భంగా ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు.. “ఒక ఆలోచన నుంచి విజన్ వరకు: గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి GOAT తొలి గుర్తుగా ‘TN07 CM 2026’ నంబర్ ప్లేట్ అందించడం సంతోషంగా ఉంది. అనుకున్నట్టే విజయ్ చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.” అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు.

TVK పార్టీని విజయ్ 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన కొద్ది నెలలకే GOAT విడుదలైంది. అప్పటికే విజయ్ రాజకీయ ప్రవేశంపై భారీ చర్చ సాగుతుండగా, ఇప్పుడు ఈ నంబర్ ప్లేట్ సన్నివేశం మళ్లీ వైరల్ కావడం సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇపుడు ఈ ఐకానిక్ నెంబర్ ప్లేట్ మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.