నిర్మల్, వెలుగు: దేశంలోని దాదాపు 300 మంది సాధువులు, సత్పురుషులు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పవిత్ర గోదావరి నది నుంచి ప్రారంభించిన గోదావరి పరిక్రమ (ప్రదక్షిణ) యాత్ర మంగళవారం నిర్మల్కు చేరుకోనుంది. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులంతా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉదయం ఈ సాధువులంతా బాసర గోదావరి నది వద్ద స్నానాలు ఆచరించి సరస్వతి దేవిని దర్శించుకుంటారు.
అక్కడి నుంచి ఈ యాత్ర జిల్లాలో ప్రారంభమవుతుంది. నిర్మల్ గోదావరి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రి గుండా యాత్ర సాగనుంది. నాసిక్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది మీదుగా యానం సముద్రం దాటుకొని మళ్లీ నాసిక్ కు చేరుకోనుంది. పీఠాధిపతులు, యోగులు, సాధువులు తదితరులు యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు.
నిర్మల్‌లోని శంబాజీ చౌక్ ఈద్గావ్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే హైందవ ధర్మ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంఘాలు, పుర ప్రముఖులు, డాక్టర్స్,టీచర్స్‌తో చర్చించారు.

