
బాసర, వెలుగు: ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండడంతో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉప్పంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలను ముథోల్ సీఐ మల్లేశ్, ఎస్సై శ్రీనివాస్ అలర్ట్ చేశారు. బ్యాక్ వాటర్ వల్ల సరస్వతి ఆలయం నుంచి గోదావరి నది 1వ ఘాట్‌కు వెళ్లే మార్గం లోని లోతట్టు ప్రాంతాలు వద్ద నీరు నిలవడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.
ప్రత్యామ్నాయంగా గోదావరి బ్రిడ్జి ప్రధాన రహదారి వైపు నుంచి యాత్రికులు, భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. బాసర–ఓని మార్గం 20 రోజుల నుంచి ముంపులోనే ఉంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బాసర జాతీయ రహదారి బ్రిడ్జి పైనుంచి రాకపోకలు సాఫీగానే సాగుతున్నాయి.