
- రోడ్లపైకి చేరిన వరద, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. గోదావరితో పాటు దాని ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత ఉప్పొంగుతుండటంతో మేడిగడ్డ దిగువన 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పారుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్‌వద్ద బుధవారం ఉదయం 11 గంటల వరకు గోదావరి నీటిమట్టం 15.820 మీటర్లకు చేరగా.. భద్రాచలం వద్ద రాత్రి 10 గంటల వరకు 48 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది.
రామన్నగూడెం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి నదికి మంగళవారం రాత్రి నుంచి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. మేడిగడ్డ వద్ద మంగళవారం 5.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూ బుధవారం నాటికి 10.80 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో భూపాలపల్లి, ములుగు జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల ప్రజల ఇండ్లు, పంటలు నీట మునిగాయి. బ్యారేజీకి ఉన్న 85 గేట్లను తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వవదిలేస్తున్నారు.
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ఉదయం 11 గంటలకు ప్రవాహం 14.820 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా...మధ్యాహ్నం 2 గంటలకు 15.820 మీటర్లకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద క్రమంగా పెరుగుతుండడంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు గోదావరి తీర ప్రాంతాలపై దృష్టి పెట్టారు.
నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామం వద్ద గోదావరి ప్రవాహం 17.440 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఐదు కుటుంబాలు, వాజేడు మండలంలో 15, కన్నాయిగూడెంలో 33, గోవిందరావుపేటలో రెండు, ఏటూరునాగారంలో 50 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆఫీసర్లు తెలిపారు.
భద్రాచలం వద్ద..
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం బుధవారం ఉదయం 8.15 గంటలకు 43 అడుగులకు చేరుకుంది. దీంతో వెంటనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద క్రమంగా పెరుగుతూ సాయంత్రం 6 గంటలకు 46.60 అడుగులు, రాత్రి 10 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రవాహం ఇలాగే కొనసాగి నీటిమట్టం 53 అడుగులు చేరితే మూడో ప్రమాదహెచ్చరిక జారీ చేయనున్నారు.
స్నానఘట్టాలు పూర్తిగా నీట మునగడంతో అక్కడ ఉన్న దుకాణాలను తరలించారు. కరకట్టలకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేసి నీరు పట్టణంలోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అశోక్‌నగర్ కొత్త కాలనీ వద్ద స్లూయిజ్ లీక్ కావడంతో నీరు వస్తుంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ స్లూయిజ్ ప్రాంతాన్ని సందర్శించి లీకేజీని నియంత్రించాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు.
స్నానఘట్టాల వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. భద్రాచలంతో పాటు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ ఆఫీసర్లను ఆదేశించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా వాగులు, ఉపనదులు, గోదావరి వద్ద గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లతో పాటు నాటు పడవలు, స్పీడ్ బోట్లు, లాంచీలను సిద్ధం చేశామన్నారు. స్లూయిజ్‌లు మూసివేసినందున డ్రైన్ వాటర్ విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరే ప్రమాదం ఉన్నందున మోటార్లతో ఎత్తిపోయాలని ఇరిగేషన్ ఈఈ జానీని కలెక్టర్ ఆదేశించారు.
నిలిచిన రాకపోకలు
తెలంగాణ – చత్తీస్‌గఢ్ హైవే 163కి పైకి వరద నీరు చేరుకోవడంతో టేకులగూడెం గ్రామం రేగుమాగు వాగు వంతెన మునిగిపోయింది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. పేరూరు – చందుపట్ల గ్రామాల రహదారి మునిగిపోవడంతో అక్కడ కూడా వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి.
వాజేడు – గుమ్మడిదొడ్డి రహదారిపై వరద నీరు చేరుకోవడంతో వాజేడు, నాగారం, పెనుగోలు కాలనీ వాసులు జగన్నాథపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి వరద కారణంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డు నీట మునగడంతో చర్లకు వాహనాలు బంద్ అయ్యాయి.
విలీన కూనవరం మండలం మురుమూరు వద్ద రోడ్డుపై నుంచి వరద పారుతుండడంతో కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉపనదుల ఉధృతి కారణంగా బ్యాక్ వాటర్ మొత్తం రోడ్లపైకి చేరుతోంది. విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి.