నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు .. బీజీ కొత్తూరు పంపు హౌస్ నుంచి నీటి విడుదల

 నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు .. బీజీ కొత్తూరు పంపు హౌస్ నుంచి నీటి విడుదల
  • ఒక మోటార్​ ను ఆన్​ చేసిన అధికారులు 
  • కృష్ణా జలాలు ఆలస్యం అవుతుండడంతో గోదావరి జలాలు ఉపయోగించుకునే ప్లాన్ 
  • సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ తో మాట్లాడిన మంత్రి తుమ్మల
  • దాదాపు లక్షన్నర ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నాగార్జున సాగర్​ ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్​ చెప్పింది. దాదాపు లక్షన్నర ఎకరాల సాగర్​ ఆయకట్టుకు ఉపయోగపడేలా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని విడుదల చేసింది. వారం పది రోజుల్లో ఈ నీరు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు చేరే అవకాశముంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు దగ్గరనున్న మొదటి లిఫ్ట్ పంప్​ హౌజ్​ లో ఒక మోటార్​ ను ఆన్ చేయడం ద్వారా నీటిని వదిలారు. 

ఈ నీరు పూసుగూడెం దగ్గర రెండో పంప్​ హౌజ్ కు చేరుకున్న తర్వాత అక్కడి మోటార్​ ను ఆన్ చేస్తారు. అక్కడి నుంచి మూడో పంప్​ హౌజ్ కమలాపురం దగ్గర మోటార్​ ను ఆన్​ చేసి ఆయకట్టుకు అందించేందుకు సాగర్​ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువులను నింపనున్నారు. ఇప్పటికే వరి నార్లు పోసుకున్న రైతులతో పాటు, ఈ వానాకాలం పంటలు సాగు చేసుకునే రైతులకు ప్రయోజనకరంగా ఉండనుంది. 

వరి నార్లు ఎండిపోతుండడంతో...

ఉమ్మడి జిల్లాలో మే, జూన్​ నెలల్లో కురిసిన వర్షాలతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. గత నెలలోనే కొందరు వరి నార్లు పోసుకున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవడంతో వరి నార్లు ఎండిపోయే పరిస్థితి ఉండడంతో అన్నదాతలు ఇబ్బందులు పడడాన్ని గుర్తించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో ఫోన్​ లో మాట్లాడారు. ప్రస్తుతం వర్షాలు లేక, సాగర్ నీరు రాక వరి నారుమళ్లు, పొలాలు ఎండిపోతున్నాయని, నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యమవుతోందని, సీతారామ ప్రాజెక్టు నుంచి విడుదలకు నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కు తుమ్మల సూచించారు.

 తర్వాత విద్యుత్ శాఖ అధికారులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లతోనూ మంత్రి తుమ్మల మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కూడా సానుకూలంగా స్పందించడంతో శనివారం మధ్యాహ్నం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని బీజీ కొత్తూరు పంప్​ హౌజ్​ లో ఒక మోటార్ ను ఆన్​ చేసి నీటిని రిలీజ్​ చేశారు. అక్కడి నుంచి సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ తో పాటు ఏన్కూరు రాజీవ్ లింక్​ కెనాల్ ద్వారా సత్తుపల్లి, వైరా, మధిరతో పాటు వర్షాధారంపై పంటలు వేసుకునే అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి. గోదావరి జలాలు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో బోర్లు, బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరగనున్నాయి. 

రైతులు ఫుల్ ​ఖుషీ.. 

సీతారామ ప్రాజెక్టు నీళ్లను సాగర్​ ఆయకట్టుకు ఉపయోగించుకునేందుకు గతేడాది ఆగస్టు 15న రూ.100 కోట్లతో నిర్మించిన రాజీవ్​ లింక్​ కెనాల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రెండు వారాల పాటు గోదావరి నీటిని రిలీజ్​ చేశారు. మూడు పంప్​ హౌజ్​ ల ద్వారా నీటిని విడుదల చేసిన తర్వాత భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్​ దగ్గరకు చేరతాయి. 

అక్కడ గతేడాది నిర్మించిన 8.6 కిలోమీటర్ల రాజీవ్​ లింక్​ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లు ఏన్కూరు మండలం అక్కినాపురం తండా 52 వ కిలోమీటర్​ దగ్గర నాగార్జున సాగర్​ ప్రాజెక్టు కాల్వకు చేరుతాయి. తర్వాత సాగర్​ కాల్వల ద్వారా దిగువ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వానాకాలం పంటల సాగుపై గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న రైతులు, ఇప్పుడు గోదావరి నీటిని విడుదల చేయడంతో సంతోషంగా ఉన్నారు.