గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ లెవల్ హాకీ పోటీలు జరిగాయి. ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ ఆటలను ప్రారంభించారు.
ఉదయం సెషన్లో ఆర్జీ 1, 2(గోదావరిఖని), కొత్తగూడెం కార్పొరేట్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. ఆర్జీ 1, 2 టీం గెలుపొందింది. ఆ తర్వాత భూపాలపల్లి, మణుగూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది.
మధ్యాహ్నం సెకండ్ సెషన్లో ఆర్జీ 1, 2, బెల్లంపల్లి జట్ల మధ్య పోటీ జరగగా బెల్లంపల్లి జట్టు మూడు పాయింట్లతో గెలుపొందింది. శ్రీరాంపూర్, మణుగూరు జట్ల మధ్య జరిగిన పోటీలో మూడు పాయింట్లతో శ్రీరాంపూర్ జట్టు నెగ్గింది. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను శాలువాలతో సన్మానించి పూల బొకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఎస్ వో టు జీఎం కె.చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
