గోదావరిఖని సమ్మక్క–సారలమ్మ జాతర హుండీ ఆదాయం రూ.29.44 లక్షలు

గోదావరిఖని  సమ్మక్క–సారలమ్మ జాతర హుండీ ఆదాయం రూ.29.44 లక్షలు

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన 44 హుండీలను సోమవారం స్థానిక జీఎం ఆఫీస్​ సమీపంలోని సారలమ్మ గుడి వద్ద లెక్కించారు. ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కించగా హుండీలో రూ.29,44,489 నగదు వచ్చింది. అలాగే 23 అమెరికన్​ డాలర్లు, కేజీ 800 గ్రాములు వెండి, 12 గ్రాముల బంగారం వచ్చింది. 

అప్పటికే నిర్వహించిన జాతర టెండర్ల ద్వారా రూ.13,84,350, టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.5,57,670 రాగా మొత్తం కలిపి రూ.48,86,509 ఆదాయం లభించింది. ఈసారి జాతరలో డిజిటల్​ స్కానర్లను ఏర్పాటు చేయగా, దాని ద్వారా వచ్చిన నగదు తెలియాల్సి ఉంది. రాజరాజేశ్వరస్వామి మహిళా గ్రూపు సభ్యులు హుండీ డబ్బు లెక్కించగా, జాతర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి బంగారి రాజయ్య, కార్పొరేటర్​ జనగామ కవిత, ఎండోమెంట్​అసిస్టెంట్​ కమిషనర్​ ఎ.చంద్రశేఖర్​, ఈవో కాంతారెడ్డి, ఎస్ఐ ఫరీద్​, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

నల్లగొండ జాతర ఆదాయం రూ.10లక్షలు
 

కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీలను అధికారులు సోమవారం లెక్కించారు. నెల రోజులకు గానూ రూ.10,10,090 నగదు వచ్చినట్లు ఈవో అనూష తెలిపారు. లెక్కింపులో స్పెషల్ ఆఫీసర్ రవి కిషన్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.