తల్లి సూసైడ్​.. కొడుకు మిస్సింగ్​!

తల్లి సూసైడ్​.. కొడుకు మిస్సింగ్​!

రోజూ స్కూల్​కెళ్లడం, ఇంటికి వచ్చాక హాయిగా పిల్లలతో ఆడుకోవడం.. ఇదే ఏడేండ్ల తిమొతి పిట్జెన్​ డైలీ రొటీన్​. ఒక రోజు ఉదయం తిమొతి చదువుకునే స్కూల్​కి తల్లి అమీ పిట్జెన్‌‌ వెళ్ళింది. తల్లిని చూసిన తిమొతి ఆనందంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె అతన్ని ఒక హోటల్​కి, తర్వాత వాటర్​పార్క్​కి తీసుకెళ్లింది. ఇద్దరూ సరదాగా గడిపారు. కట్ చేస్తే​ అమీ ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి తిమొతి కనిపించడంలేదు. ఇంతకీ వాళ్లకు ఏమైంది?ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ దొరకలేదు. 

జేమ్స్ పిట్జెన్, అమీ పిట్జెన్‌‌ల ఏకైక సంతానం తిమొతి పిట్జన్​. అక్టోబర్18, 2004న పుట్టాడు. 2006 నుండి వాళ్ల కుటుంబం అమెరికాలోని ఇలినాయీ దగ్గరలోని అరోరాలో ఉన్న నార్త్ హైలాండ్ అవెన్యూలోని 400వ బ్లాక్‌‌లో ఉంటోంది. తిమొతి ఎక్కువగా బయటే ఆడుకునేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండేవాడు. అమ్మానాన్నలు కూడా బాగా చూసుకునేవాళ్లు. ఇంట్లో పెద్దగా గొడవలు లేవు. హాలిడేస్​లో ముగ్గురూ కలిసి పార్క్​, జూకి వెళ్లేవాళ్లు. వీకెండ్స్​లో బయటికెళ్లి పిజ్జాలు తినేవాళ్లు. మెక్‌‌డొనాల్డ్స్ ప్లేలాండ్స్​కి వెళ్తుండేవాళ్లు. 

తల్లిదండ్రులిద్దరూ కలిసి తిమొతిని స్కూల్​లో చేర్పించారు. రోజూ కొడుకుని స్కూల్‌‌లో వదిలేసి ఆఫీస్​కి వెళ్లేవాడు జేమ్స్​. రోజులాగే మే11, 2011 నాడు కూడా తిమొతిని ‘గ్రీన్‌‌మ్యాన్ ఎలిమెంటరీ స్కూల్‌‌’లోని కిండర్ గార్టెన్ క్లాస్‌‌లో దింపి, వెళ్లిపోయాడు. కానీ.. ఆ తర్వాత కొద్దిసేపటికే అమీ స్కూల్​కి వెళ్లింది. తిమొతిని తీసుకుని వెళ్తుంటే... ‘బాబుని ఎందుకు తీసుకెళ్తున్నార’ని టీచర్లు అడిగారు. కానీ, ఆమె సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయింది. 

అప్పటివరకు ఎప్పుడూ.. 

ఆ రోజు సాయంత్రం తిమొతి కోసం వెళ్లిన జేమ్స్​కి బాబుని అమీ తీసుకెళ్లినట్టు టీచర్లు చెప్పారు. దాంతో జేమ్స్​ ఇంటికెళ్లాడు. కానీ.. ఇంట్లో తల్లీబిడ్డా ఇద్దరూ లేరు. తెలిసినవాళ్లందరికీ ఫోన్​ చేశాడు. అందరి నుంచీ తెలియదనే సమాధానమే వచ్చింది. అప్పటివరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. స్కూల్​ నుంచి తిమొతిని రోజూ జేమ్స్ తీసుకొస్తాడు. ఒక్కరోజు కూడా అమీ తీసుకురాలేదు. కానీ.. ఆ రోజు అమీ తీసుకెళ్లింది అనేసరికి జేమ్స్​లో భయం మొదలైంది. కారణం.. అమీ డిప్రెషన్​తో బాధపడుతోంది. అందుకు మందులు వాడుతోంది.  కానీ.. ఆ రోజు ఉదయం తను యాంటీ డిప్రెషన్ మందులు వేసుకోలేదు. అందుకే జేమ్స్​ పోలీస్​ స్టేషన్​కి వెళ్లి విషయం చెప్పాడు. పోలీసులు వాళ్లను వెతకడం మొదలుపెట్టారు. అన్ని పోలీసు విభాగాలకు ఇన్​ఫర్మేషన్​ ఇచ్చారు. అక్కడక్కడ మిస్సింగ్ పోస్టర్లు  కూడా అతికించారు. 

సూసైడ్​?!

వాళ్లు తప్పిపోయిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. రాక్‌‌ఫోర్డ్ మోటెల్(మోటెల్​ అంటే రోడ్డు పక్కన ఉండే చిన్న 
హోటల్​) గదిలోని బాత్రూమ్​లో అమీ శవం దొరికింది. చేతి మణికట్టుని కత్తితో కోసుకుని చనిపోయిందామె. అక్కడ ఒక సూసైడ్​ నోట్​ దొరికింది. అందులో ‘‘తిమొతి సేఫ్​గా ఉన్నాడు. అతను మీకు ఎప్పటికీ దొరకడు. కాబట్టి, వెతకడం మానేయండి” అని రాసి ఉంది. దాంతో పోలీసులు ఆమె చనిపోయిన రూమ్​ నుంచే తిమొతి కోసం ఇన్వెస్టిగేషన్​ చేయడం మొదలుపెట్టారు. అతను ఆ మోటెల్​లో ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 

అసలేం జరిగింది 

పోలీసులు ఆ మూడు రోజుల్లో ఆమె ఏం చేసిందో తెలుసుకున్నారు. తిమొతిని స్కూల్​ నుంచి తీసుకొచ్చాక... అమీ, తిమొతి కలిసి బ్రూక్‌‌ఫీల్డ్ జూకి వెళ్లారు. అక్కడి నుంచి కీ లైమ్ కోవ్ అనే రిసార్ట్‌‌కి వెళ్లారు. ఆ రిసార్ట్​లో ఒక రాత్రి ఉండాలంటే.. దాదాపు 150 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ మరుసటి రోజు రాత్రి వాటర్​పార్క్​ ఉన్న మరో రిసార్ట్​ విస్కాన్సిన్ డెల్స్‌‌కు వెళ్లారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కూడా కనిపించారు వాళ్లు. ఆ మరుసటి రోజు ఉదయం చెకవుట్​ చేశారు. ఇద్దరూ కలిసి కనిపించింది అదే చివరిసారి. ఆ ఫుటేజీలో తిమొతి తల్లి చేతిని పట్టుకుని ‘క్యూ’లో నిల్చున్నాడు. తర్వాతి రోజు ఉదయం జేమ్స్ మినహా కొందరు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్​కి టెక్స్ట్​మెసేజ్​లు చేసింది అమీ. ‘నేను, తిమొతి సేఫ్​గా ఉన్నాం’ అనేది ఆ మెసేజ్​ల సారాంశం. అంతేకాదు.. వాళ్ల బంధువుల్లో ఒకరు ఆమెకి ఫోన్​ చేసి, తిమొతితో కూడా మాట్లాడాడు. అదే రోజు ఇలినాయీలోని విన్నెబాగోలో ఒక స్టేషనరీ షాపు​లోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అక్కడామె పేపర్లు, పెన్నులు, ఎన్వలప్​ కవర్లు కొన్నది. ఆ తర్వాత ఒక ఫుడ్​ కోర్ట్​లోని కెమెరా ఫుటేజీలో కనిపించింది. అక్కడ పాలు, క్రాకర్స్​ కొన్నది. ఆ తర్వాత అదే రోజు రాత్రి రాక్‌‌ఫోర్ట్‌‌లోని హోటల్​కి వెళ్లింది. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు పనిమనిషి ఆమె శవాన్ని చూసింది.ఇంతకీ ఆమెకేం జరిగింది? ఆమెది హత్యా? ఆత్మహత్యా? తిమొతి ఎక్కడున్నాడు? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఇప్పటికీ తిమొతి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే.. 2019 లో ఒక వ్యక్తి వచ్చి ‘‘నేనే తిమొతి’’ అని చెప్పాడు. డీఎన్​ఏ టెస్ట్​ చేసి, అతను తిమొతి కాదని తేల్చేశారు.