దాణా బస్తాలో 10తులాల బంగారు దొరికితే తిరిగిచ్చేశారు

దాణా బస్తాలో 10తులాల బంగారు దొరికితే తిరిగిచ్చేశారు
  • దొంగలకు భయపడి మొక్కజొన్న బస్తాలో దాచుకున్న రైతు
  • నిజాయితీ చాటుకున్న పిండిగిర్ని నిర్వాహకులు బషీర్-నూర్జహాన్ దంపతులు
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఘటన

కరీంనగర్: దొంగల భయానికి ఇంట్లోని విలువైన ఆభరణాలు తీసి ఆ ఇల్లాలు మొక్కజొన్న బస్తాలో దాచిపెట్టింది. ఇది తెలియని ఆమె భర్త దాణా పట్టించేందుకు మొక్క జొన్న బస్తాలను తీసుకుని పిండిగిర్నికి తరలించాడు. పిండిగిర్నీ వద్ద వేచి ఉండకుండా మళ్లీ వద్దామనుకుని ఇంటికెళ్లిపోయాడు. రైతు వెళ్లిపోయిన తర్వాత మొక్క జొన్న బస్తాలను దాణా కోసం పిండిమిషన్ లో వేసి మర పట్టించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో ఒక బస్తా తెరచి మిషిన్ లో వేయగా 10 తులాల బంగారు నగలు, 12 తులాల వెండి నగలు దొరికాయి. వెంటనే ఆ పిండిమిషన్ నిర్వాహకులు వాటి అసలు దారు అయిన రైతును పిలిపించి అప్పగించాడు. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో జరిగిందీ ఘటన. 
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో బషీర్- నూర్జాహాన్ దంపతులు పిండిగిర్ని నిర్వహించుకుని జీవిస్తున్నారు. శనివారం నాడు ఓ రైతు తన మొక్కజొన్న పంటను మరపట్టించేందుకు తెచ్చిచ్చాడు. దాణా మరపట్టించేందుకు సమయం పడుతుంది కాబట్టి 25కిలోల చొప్పున ఉన్న మొక్కజొన్న బస్తాలు పిండిగిర్నిలో దించేసి వెళ్లిపోయాడు. రెగ్యులర్ గా వేసే జొన్నలు, గోధుమలు మరపట్టించడం అయిపోయాక పిండిగిర్ని నిర్వాహకులు మొక్కజొన్న సరుకు తీసి మర ఆడించడం ప్రారంభించారు. అయితే ఒక బస్తా తెరచి పిండి మిషన్ లో వేయగా 10 తులాల బంగారు చైన్, చెవి కమ్మలు, రింగులు దొరికాయి. వీటితోపాటు 12 తులాల వెండి ఆభరణాలు కూడా దొరికాయి. రైతుకు చెందిన సరుకుగా గుర్తించిన పిండిగిర్ని నిర్వాహకులు బషీర్-నూర్జహాన్ దంపతులు వెంటనే రైతుకు సమాచారం ఇచ్చి ఆభరణాలు భద్రంగా అప్పగించారు. ఇంట్లో భద్రత లేదని తాము ఎప్పుడో దాచుకున్నబంగారు,వెండి ఆభరణాలు మొక్కజొన్న బస్తాలో ఉండడం గుర్తుకొచ్చి రైతు దంపతులు షాక్ గురయ్యారు. తమ ఆభరణాలన్నీ నిజాయితీగా తిరిగిచ్చిన పిండిగిర్ని నిర్వాహకులకు కృతజ్ఘతలు తెలుపుకున్నారు. ఆభరణాల విలువ సుమారు ఐదు లక్షలపైనే ఉంటుందని, దొంగల భయానికి మొక్కజొన్న సంచిలో దాచిపెట్టుకున్నట్లు చెప్పారు. 
నిజాయితీ చాటుకున్న దంపతులను సత్కరించిన లక్ష్మీ చారిటబుల్ ట్ర్రస్ట్
రైతు పట్ల మానవత్వంతో స్పందించి నిజాయితీ చాటుకున్న పిండిగిర్ని నిర్వాహకులు బషీర్-నూర్జహాన్ దంపతులను లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రఘునాథ్ రెడ్డి ఆదివారం ఘనంగా సత్కరించారు. మొక్కజొన్న దాణా పట్టించేందుకు తెచ్చిన 25 కిలోల బస్తాలో దాచిపెట్టుకున్న పది తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు గుర్తించి రైతును పిలిచి ఇచ్చేయడం గొప్ప మానవత్వానికి, నిజాయితీకి నిదర్శనం అన్నారు. మంచిని పంచే ఇలాంటి వారుండడం సమాజానికి స్ఫూర్తి దాయకమని అభినందించారు.