బంగారం డిమాండ్​ తగ్గుతోంది

బంగారం డిమాండ్​ తగ్గుతోంది

వెలుగు బిజినెస్​ డెస్క్​: కరోనా వైరస్​ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనేవాళ్లు కరువవుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లపై ఆంక్షలు పెడుతుండటంతో గోల్డ్​కి డిమాండ్​ మళ్లీ తగ్గుతోంది. మన దేశంలో బంగారం డిమాండ్​ పెరగడానికి ముఖ్య కారణాలలో పెళ్లిళ్లు కూడా ఒకటి. జనవరి రెండో వారంలో మొదలయ్యే పెళ్లిళ్ల సీజన్​ మే నెల దాకా కొనసాగుతుంది. దేశంలో కరోనా వైరస్ కొత్త​ కేసులు గురువారం నాటికి 2 లక్షలకు చేరాయి. దీంతో చాలా రాష్ట్రాలు నైట్​ కర్ఫ్యూతోపాటు, పగటి పూటా కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ఫలితంగా ఫంక్షన్లను భారీగా జరుపుకోవడం వీలవడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజనైనా బంగారం కొనడానికి కొనుగోలుదారులు ఎక్కువ ఉత్సాహం చూపించడం లేదని పరిశ్రమ వర్గాలు చెఈబుతున్నాయి.

కరోనా వైరస్​ భయం ప్రజలలో మళ్లీ పెరిగిన నేపథ్యంలో రిటెయిల్​ స్టోర్లకు రావడానికి జంకుతున్నారని ఆల్​ ఇండియా జెమ్​ అండ్​ జ్యుయెలరీ డొమెస్టిక్​ కౌన్సిల్​ ఛైర్మన్​ ఆశిష్​ పీఠె చెప్పారు. మార్చితో ముగిసే ఈ క్వార్టర్లో బంగారం డిమాండ్​ నెమ్మదిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారం అమ్మకాలు 2021 సెకండ్​ హాఫ్​లోనే పుంజుకున్నాయి. ఆ ఏడాది బంగారం దిగుమతులు ఆరేళ్ల గరిష్టానికి చేరాయంటే డిమాండ్​ ఏ రేంజ్​లో పెరిగిందో ఊహించొచ్చు. కరోనా వైరస్​ సంబంధ ఆంక్షలు తొలగిపోవడం వల్లే పసిడి డిమాండ్​కు రెక్కలొచ్చాయి. కరోనా వైరస్​వల్ల చాలా మంది పెళ్లిళ్లను రెండేళ్లపాటు వాయిదా వేసుకోవలసి వచ్చింది. 

తాజా వేవ్​లో అమ్మకాలు మరీ ఎక్కువగా తగ్గకపోవచ్చని, ఎందుకంటే చాలా రాష్ట్రాలు షాపులను మూసివేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని యూటీ జవేరి స్టోర్​ ఓనర్​ కుమార్​ జైన్​ చెప్పారు. కొంత మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం లేదని, అవసరమనుకుంటే ఆంక్షలు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో పెళ్లిళ్లు జరుపుతున్నారని పేర్కొన్నారు.మార్చి 2021 క్వార్టర్లో దేశంలో బంగారం అమ్మకాలు 37 శాతం ఎగసి 140 టన్నులకు చేరినట్లు వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ డేటా చెబుతోంది. 2021 పూర్తి ఏడాదికి డబ్ల్యూజీసీ ఇంకా డేటా విడుదల చేయలేదు. 2020 నాటి పెంటప్​ డిమాండ్​ కొంత 2021లో పూర్తయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2022లో గోల్డ్​ డిమాండ్​ 750 టన్నుల దాకా ఉండొచ్చని పీఠె అన్నారు. బహుశా మార్చి నెల నుంచి పరిస్థితులలో కొంత మార్పు రావచ్చని పేర్కొనారు.

బంగారం రేటు పెరగొచ్చు.. డబ్ల్యూజీసీ అంచనా

సెంట్రల్​ బ్యాంకుల నుంచి, జ్యుయెలరీ మార్కెట్ల నుంచి వచ్చే డిమాండ్​ 2022లో స్థిరంగా ఉంటుందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగా ఉండటంతో హెడ్జింగ్​ సాధనంగానూ గోల్డ్​లో పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంది. 2021 చివరిలో బంగారం రేట్లలో కొంత ర్యాలీ వచ్చినా, 2020 తో పోలిస్తే 4 శాతం తగ్గి ఔన్సుకి 1806 డాలర్లకు చేరాయని డబ్ల్యూజీసీ తాజాగా విడుదల చేసిన అవుట్​లుక్​2022లో తెలిపింది. ఈ ఏడాది యూఎస్​ గవర్నమెంట్​ వడ్డీ రేట్లను పెంచనుంది. యూరోపియన్​ సెంట్రల్​ బ్యాంక్​ మాత్రం వడ్డీ రేట్లను ఇప్పటిలో పెంచే ఉద్దేశంలో లేదు.మరోవైపు ఎకానమీ రికవరీ కోసం మానిటరీ పాలసీని కొంత సరళంగానే అట్టేపెట్టాలనే ఆలోచనను ఆర్​బీఐ కనబరుస్తోంది. ఇన్​ఫ్లేషన్​ ఎక్కువున్న ప్రతిసారీ బంగారం రేట్లు పైనే ఉండటం సాధారణంగా జరుగుతోందని, గ్లోబల్​గా ఈ ఏడాది ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూజీసీ చెబుతోంది.