దేశంలో జీఎస్టీ వసూళ్లు అక్టోబర్ నెలలో 5 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 4.6 శాతం వృద్ధి చెంది రూ.1.96 లక్షల కోట్లుగా నమోదైంది. మెుత్తంగా ఆదాయం స్థిరంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి నవరాత్రి సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ తగ్గింపులు ప్రకటించిన తర్వాత అనూహ్యంగా ఆదాయం పెరగటం గమనార్హం. రేట్లు తగ్గించినప్పటికీ పండుగల సీజన్ ప్రజల కొనుగోళ్లే కలెక్షన్స్ పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.89 లక్షల కోట్లు కాగా.. అక్టోబర్ నెలలో రూ. 1.96 లక్షల కోట్లకు పెరిగాయి. గత నాలుగు నెలల గరిష్ట వృద్ధి (9.1%)తో పోలిస్తే ఈ సారి వృద్ధి దాదాపు సగానికి తగ్గింది. అయినప్పటికీ వరుసగా పదో నెలలో కూడా వసూళ్లు రూ.1.8 లక్షల కోట్లకు పైగానే ఆదాయం నమోదు కావటం గమనార్హం. అలాగే గత మే నెలలో దేశం చివరిసారిగా రూ.2 లక్షల కోట్ల మార్క్ దాటిన జీఎస్టీ ఆదాయాన్ని చూసింది.
జీఎస్టీ వసూళ్లలో ఈ మందగమనానికి ప్రధాన కారణం.. ఇటీవల జరిగిన పన్ను సంస్కరణలేనని నిపుణులు అంటున్నారు. ఆగస్టులో ప్రధాని జీఎస్టీ విధానాన్ని పునఃవ్యవస్థీకరించనున్నట్లు ప్రకటించగా.. సెప్టెంబర్ 22న ప్రభుత్వం కీలకమైన పన్ను రేషనలైజేషన్‌ను అమలు చేసింది. ఈ మార్పులో 12 శాతం, 28 శాతం పన్ను స్లాబులను పూర్తిగా ఎత్తేయటంతో.. దాదాపు 90 శాతం వస్తువులను తక్కువ పన్ను స్లా్బ్ కిందకు వచ్చాయి.
►ALSO READ | అమెజాన్ బ్యాడ్ మార్నింగ్ : అర్థరాత్రి టైంలో లేఆఫ్స్ మెయిల్స్ : ఇండియాలో ఎంత మందికి అంటే..!
అక్టోబర్ నెలలో నికర జీఎస్టీ సేకరణలు 0.6 శాతం పెరిగి రూ.1.69 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ ఆదాయాలు స్థిరంగా ఉండగా, కస్టమ్స్ ఆదాయం 2.5 శాతం పెరిగి రూ.37,210 కోట్లుగా ఉంది. దేశీయ రిఫండ్లు 26.5 శాతం, కస్టమ్స్ రిఫండ్లు 55.3 శాతం పెరిగాయి. దేశీయ స్థాయిలో మొత్త రెవెన్యూ 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లుగా నమోదైంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా దేశ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. ఇటీవల జీఎస్టీ పన్ను కోతలు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచి, అమెరికా వాణిజ్య సుంకాల ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే నవంబర్ వసూళ్లు అమ్మకాలపై క్లారిటీ ఇవ్వొచ్చని వారు చెబుతున్నారు.
