బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం

బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం

గత రెండు రోజులుగా బెంగళూరులోని 16 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా భారీగా నగదు, బంగారం పట్టుబడింది. పారిశ్రామికవేత్తలు,  బంగారు వ్యాపారుల ఆవరణలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం రూ.కోటి 33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 22 కిలోల 923 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాలు, బినామీ ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.

  • బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శంకర్‌పూర్‌లో రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
  • శారాదేవి రోడ్డులో రూ.3 కోట్ల 39 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
  • మర్కంటైల్ బ్యాంకులో రూ.2 కోట్ల 13 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
  • జయనగర్ 3వ బ్లాక్‌లో రూ.5 కోట్ల 33 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
  • చామరాజ్‌పేటలోని సరస్వత్ బ్యాంకులో 84 విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు.
  • బసవనగుడిలోని పోస్టాఫీసులో 3 లక్షల 34 వేల విలువైన 6.38 క్యారెట్ల వజ్రం లభించింది.
  • శారదా దేవి రోడ్డులో 3 లక్షల 14 వేల విలువైన 5.99 క్యారెట్ల వజ్రం లభ్యమైంది.
  • జయనగర్‌లో రూ.6 కోట్ల 40 లక్షల విలువైన 202.83 క్యారెట్ల వజ్రం బయటపడింది.

మరోవైపు ఏప్రిల్ 26న కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది.  రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.