ట్విట్టర్​ లో కొత్త మార్పులు.. డిసెంబరు 2 నుంచి  బ్లూ, గోల్డ్​, గ్రే టిక్స్​

ట్విట్టర్​ లో కొత్త మార్పులు.. డిసెంబరు 2 నుంచి  బ్లూ, గోల్డ్​, గ్రే టిక్స్​

ట్విట్టర్ ​ఖాతాదారులకు సంబంధించిన వెరిఫికేషన్​ ఫీచర్​ లో ఆ సంస్థ యజమాని ఎలాన్​ మస్క్​ కీలక మార్పులు చేశారు. ఇవి డిసెంబరు 2 (శుక్రవారం) నుంచి  ట్విట్టర్​ లో అమల్లోకి రానున్నాయి. ఆ రోజు నుంచి ట్విట్టర్​ లో అకౌంట్​ కలిగిన కంపెనీలకు గోల్డ్​ టిక్​, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్​, వ్యక్తులకు (సెలబ్రిటీలు, ఇతరులు)  బ్లూ టిక్​ను కేటాయిస్తారు.

అకౌంట్లు మ్యానువల్​ గా..

అన్ని వేరిఫైడ్​ అకౌంట్లు మ్యానువల్​ గా ధ్రువీకరణ పొందిన తర్వాతే వాటికి టిక్​ ను కేటాయిస్తామని ఎలాన్​ మస్క్​ స్పష్టంచేశారు. వాస్తవానికి ఈ మార్పులను నవంబరు 29 నుంచే అమల్లోకి తేవాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత తేదీని డిసెంబరు 2కు వాయిదా వేశారు. 

ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..

ట్విట్టర్​ ను మస్క్​ కొనుగోలు చేయకముందు వరకు ప్రభుత్వ విభాగాల చీఫ్​లు, క్రికెటర్లు, మూవీ స్టార్స్​, ఇతర రంగాల సెలబ్రిటీల ఖాతాల వివరాలను తనిఖీ చేసి బ్లూటిక్​ మంజూరు చేసేవారు. ట్విట్టర్​ ను కొనగానే బ్లూటిక్​ను మంజూరు చేసేందుకు ప్రతి నెలకు 8 డాలర్ల ఫీజును వసూలు చేయాలని మస్క్ తొలుత​ నిర్ణయించారు. ఈక్రమంలో 8 డాలర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్​ ఇచ్చేశారు. దీంతో ఎన్నో నకిలీ ఖాతాలు బయటపడ్డాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్లూటిక్​ మంజూరుకు ప్రతినెలా 8 డాలర్ల ఫీజును వసూలు చేసే సర్వీస్​ ను మస్క్ వెంటనే​ నిలిపివేశారు. ఈక్రమంలోనే మూడు రకాల వెరిఫికేషన్​ టిక్ లను ఆయన ట్విట్టర్​ లో ప్రవేశపెట్టారు. ​ ఈ టిక్​ లను మస్క్​ ఏ రకంగా జనంలోకి తీసుకెళ్తారనేది వేచి చూడాలి.