భళా దీపక్‌.. ఇవాళ ఒలింపిక్‌‌‌‌ చాంప్‌‌‌‌తో ఫైనల్ పోరు  

భళా దీపక్‌.. ఇవాళ ఒలింపిక్‌‌‌‌ చాంప్‌‌‌‌తో ఫైనల్ పోరు  
  • ఫైనల్లో దీపక్‌‌‌‌ పునియా    ఒలింపిక్‌‌‌‌ బెర్త్‌‌‌‌ కైవసం
  • నేడు ఒలింపిక్‌‌‌‌ చాంప్‌‌‌‌తో స్వర్ణ పోరు  
  • కాంస్య రేసులో రాహుల్‌‌‌‌ అవారే

నూర్‌‌‌‌ సుల్తాన్‌‌‌‌ (కజకిస్థాన్‌‌‌‌): వరల్డ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ 20 ఏళ్ల దీపక్‌‌‌‌ పునియా.. ప్రపంచ రెజ్లింగ్‌‌‌‌లో అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌ చేశాడు. 86 కేజీ విభాగంలో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ బౌట్‌‌‌‌కు దూసుకుపోవడంతో పాటు ఒలింపిక్‌‌‌‌ బెర్త్‌‌‌‌ కూడా దక్కించుకున్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో దీపక్‌‌‌‌ 8–2తో స్విట్జర్లాండ్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ స్టెఫాన్‌‌‌‌ రైచ్ముత్‌‌‌‌ను చిత్తుగా ఓడించాడు. అంతకుముందు తీవ్ర ఉత్కంఠ రేపిన క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో 7–6తో కొలంబియాకు చెందిన కార్లోస్‌‌‌‌ అర్టురో మెండెజ్‌‌‌‌పై కష్టపడి గెలిచి టోక్యో టిక్కెట్‌‌‌‌ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్‌‌‌‌ 74కేజీల గోల్డ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ హసన్‌‌‌‌ యజ్దాని చరాతితో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఒక్క రోజే ఐదు బౌట్లలో తలపడ్డ దీపక్‌‌‌‌ తన ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ ఆటతో మెప్పించాడు. డిఫెన్స్‌‌‌‌, అటాక్‌‌‌‌, స్టామినా, మ్యాచ్‌‌‌‌పై అవేర్‌‌‌‌నెస్‌‌‌‌తో అన్నింటిలో విజయాలు సాధించాడు. ముఖ్యంగా సెమీస్‌‌‌‌లో తొలి మూడు నిమిషాల్లో ఎలాంటి యాక్షన్‌‌‌‌ జరగకున్నా ఒక పాయింట్‌‌‌‌ సాధించిన పునియా బ్రేక్‌‌‌‌ తర్వాత ఒక్క సారిగా జోరు పెంచాడు. రైచ్ముత్‌‌‌‌ను పుష్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేసి మరో పాయింట్‌‌‌‌ సాధించిన దీపక్‌‌‌‌..వెంటనే ప్రత్యర్థిని కిందపడేసి 4–0తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆపై రెండు పాయింట్లు కోల్పోయినా.. రైచ్ముత్‌‌‌‌ను టేక్‌‌‌‌డౌన్‌‌‌‌ చేసిన పునియా నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకోని ఈజీగా గెలిచాడు. అంతకుముందు క్వార్టర్స్‌‌‌‌బౌట్​ మరో నిమిషంలో ముగుస్తుందనగా 3–6తో వెనుకంజ వేసిన దీపక్​ గొప్పగా పుంజుకున్నాడు. ప్రత్యర్థిని టేక్‌‌‌‌డౌన్‌‌‌‌ చేయడంతో పాటు ఎక్స్‌‌‌‌పోజ్‌‌‌‌ మూవ్‌‌‌‌తో ఆఖరి క్షణాల్లో పాయింట్‌‌‌‌ సాధించి విక్టరీ కొట్టాడు. ఫైనల్‌‌‌‌ చేరిన దీపక్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ ఖాయం చేసుకోవడంతో ఈ టోర్నీలో ఇండియా ఖాతాలో నాలుగు మెడల్స్‌‌‌‌ చేరాయి. ఒక వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియాకు ఇదే బెస్ట్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌. వినేశ్‌‌‌‌ ఫొగట్‌‌‌‌, బజ్‌‌‌‌రంగ్‌‌‌‌ పునియా, రవి దహియా ఇప్పటికే 3 కాంస్యాలు నెగ్గడంతో పాటు ముగ్గురూ ఒలింపిక్స్‌‌‌‌కు క్వాలిఫై అయ్యారు.