ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. బంగారం ధర ఒక్కరోజే రూ.3,600 జంప్

ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్..  బంగారం ధర ఒక్కరోజే  రూ.3,600 జంప్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం  బంగారం ధర రూ.3,600 పెరిగి, 10 గ్రాముల ధర రూ.1,02,620కి చేరుకుని రికార్డు సృష్టించింది. అమెరికా ప్రభుత్వం భారతీయ దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించడంతో, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, బుధవారం 99.9 శాతం స్వచ్ఛత గల గోల్డ్​ 10 గ్రాముల ధర రూ.99,020 వద్ద ముగిసింది. 

తాజాగా 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ.3,600 పెరిగి రూ.1,02,200కి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.1,500 పెరిగి రూ.1.14 లక్షలకు చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​)లో అక్టోబర్ కాంట్రాక్టుల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,02,155కి, డిసెంబర్ కాంట్రాక్టుల బంగారం ధర రూ.1,03,047కి చేరి కొత్త రికార్డులు సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 0.29 శాతం పెరిగి 3,379.15 డాలర్లకు చేరింది. హైదరాబాద్​లో గురువారం 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1.02 లక్షలు పలికింది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.94 వేలు ఉంది.