గోల్డ్​లోన్​ కిస్తీలు కడ్తలేరు

గోల్డ్​లోన్​ కిస్తీలు కడ్తలేరు
  • ఇప్పటికే రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
  • ప్రకటించిన మణప్పురం ఫైనాన్స్
  • అయినా పెరుగుతున్న గోల్డ్ లోన్లు

ముంబై: కరోనా, లాక్డౌన్ల కారణంగా చాలా మంది గోల్డ్​లోన్ల కిస్తీలు కట్టడం మానేయడంతో గోల్డ్​లోన్ కంపెనీలు నగలను అమ్మేస్తున్నాయి.  మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి లో తన గోల్డ్ లోన్ పోర్ట్‌‌‌‌ఫోలియో లోన్లు 5.6 శాతం తగ్గాయని తెలిపింది. కిస్తీలు వసూలుకాక కంపెనీ రూ .404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది.  ఫైనాన్షియల్ ఎక్స్​పర్టులు మాత్రం గోల్డ్ లోన్లకు డిమాండ్ తగ్గడం తాత్కాలికమని, ఇక ముందు తప్పక పెరుగుతుందని  అంటున్నారు. మహమ్మారి కారణంగా చాలా మంది డబ్బు అవసరాల కోసం మార్ట్​గేజ్ లోన్లపై ఆధారపడతారని చెబుతున్నారు. ఏడాది ప్రాతిపదికన చూస్తే మణప్పురం ఫైనాన్స్ గోల్డ్ లోన్ పోర్ట్‌‌‌‌ఫోలియో 12శాతం పెరిగింది. బంగారేతర లోన్ల పోర్ట్‌‌‌‌ఫోలియోలోనూ ఆరోగ్యకరమైన పెరుగుదల రికార్డయింది.  ఈ కంపెనీ నికర లాభం 18శాతం పెరిగింది. రాబోయే కొన్ని నెలల్లో  గోల్డ్​లోన్లు10–-15 శాతం పెరుగుతాయని అనుకుంటున్నామని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎనలిస్టులు చెప్పారు.

జేబులో డబ్బు లేకే...
గోల్డ్ లోన్లు పెరగడం, బంగారం వేలం మరింత పెరగడాన్ని గమనిస్తే జనంలో ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయని భావించాలని ఎకానమిస్టులు చెబుతున్నారు. మణప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్ లోన్ కంపెనీలు ప్రతి క్వార్టర్లోనూ బంగారాన్ని వేలం వేస్తున్నాయి. అయితే ఇంత  మొత్తంలో పెరుగుదల మాత్రం తప్పకుండా ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది మార్చి లో మణప్పురం రూ .404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేయగా, గత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ .8 కోట్ల విలువైన బంగారాన్ని మాత్రమే వేలం వేసింది. వ్యవసాయం, దాని  అనుబంధ కార్యకలాపాల ద్వారా ఉపాధి పొందేవాళ్లు గోల్డ్​లోన్లపై ఎక్కువగా ఆధారపడతారు. పెట్టుబడి కోసం చిన్న వ్యాపారాలు కూడా అప్పుల కోసం బంగారాన్ని ఉపయోగిస్తాయి. సంక్షోభ సమయంలో అత్యవసరంగా అప్పుల కోసం సాధారణ జనం బంగారాన్ని కుదవ పెడతారు. 

బ్యాంకులకు బూస్ట్..
మణప్పురం ఫైనాన్స్ వంటి ఎన్​బీఎఫ్​సీలతోపాటు ఎస్​బీఐ వంటి బ్యాంకులకూ గోల్డ్ లోన్లు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకుల గోల్డ్ లోన్లు  ఈ ఆర్థిక సంవత్సరంలో 81శాతం పెరిగాయి. ఫెడరల్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకుల బిజినెస్లో మేజర్ వాటా గోల్డ్ లోన్ పోర్ట్‌‌‌‌ఫోలియో ద్వారానే వస్తోంది. భవిష్యతులో ఆదాయాలపై పెరిగే అవకాశాలు కనిపిచండం లేదు కాబట్టి  చిన్న వ్యాపారాలు వర్కింగ్ క్యాపిటల్ కోసం గోల్డ్ లోన్లవైపు చూడకతప్పదు. అప్పులు వసూలు కాకపోవడంతో మణప్పురం తన కస్టమర్ల బంగారాన్ని చాలా తక్కువ ధరలకే వేలం వేసింది.  ఆ కాలంలో గోల్డ్ ధరలు 10శాతం కన్నా ఎక్కువ తగ్గడమే ఇందుకు కారణం