ఎర్రకోటలో రూ.1.5 కోట్ల బంగారు కలశాలు చోరీ

ఎర్రకోటలో రూ.1.5 కోట్ల బంగారు కలశాలు చోరీ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ జైనుల మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా, పూజారి వేషంలో వచ్చిన దొంగ.. రూ.1.5 కోట్ల విలువైన బంగారు వస్తువులతో ఉడాయించాడు. అతడు ఓ సంచిలో వాటిని తీసుకెళ్తున్నట్టు సీసీటీవీలో రికార్డయింది. జైనులు పది రోజుల పాటు పవిత్రంగా జరుపుకునే ‘దశలక్షణ్ మహాపర్వ్‌‌‌‌’ కార్యక్రమం ఎర్రకోట ప్రాంగణంలో జరుగుతున్నది. ఇది ఈ నెల 9 వరకు కొనసాగనున్నది. ఈ క్రమంలో గత బుధవారం నిర్వహించాల్సిన పూజా కార్యక్రమ ఏర్పాట్లు, అతిథులను ఆహ్వానించడంలో నిర్వాహకులు బిజీగా ఉండగా.. జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ తన పని కానిచ్చాడు. పూజకు వినియోగించే బంగారు వస్తువులను దాచిన గదిలోకి వెళ్లి వాటిని దొంగిలించాడు. 

తర్వాత అక్కడే ఉన్న ఓ సంచిలో వేసుకుని ఉడాయించాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది. దీనిపై పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ‘‘రెండు బంగారు కలశాలు చోరీకి గురయ్యాయి. ఒకటి 760 గ్రాములు, మరొకటి 115 గ్రాములు ఉంటుంది. చిన్న కలశం వజ్రాలు, పచ్చలు, మాణిక్యాలు పొదిగి ఉంటుంది. వీటితో పాటు బంగారు కొబ్బరికాయ కూడా చోరీకి గురైంది. ఇవన్నీ బిజినెస్‌‌‌‌మెన్ సుధీర్ జైన్‌‌‌‌వి. ఆయన పూజా కార్యక్రమాల కోసం వాటిని తీసుకొచ్చారు” అని ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ‘‘జనం ఎక్కువగా ఉండడాన్ని దొంగ అదనుగా తీసుకుని చోరీ చేశాడు. ఆ వస్తువులు కేవలం బంగారంతో చేసినవి కావు. అవి మా సెంటిమెంట్‌‌‌‌కు సంబంధించినవి. వాటికి వెలకట్టలేం” అని సుధీర్ జైన్ అన్నారు. ఇదే దొంగ ఇంతకుముందు మూడు ఆలయాల్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడని పునిత్ జైన్ చెప్పారు. కాగా, దొంగను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.