ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్​ కు రెడీ

ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్​ కు రెడీ

లండన్: ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)ను కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో వ్యాపార సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా ఇండియాతో కొత్త ఎఫ్టీఏను కుదుర్చుకుంటామన్నారు. బ్రిటన్ ఫారిన్ పాలసీపై తొలిసారిగా సోమవారం రాత్రి లండన్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటన్ అనుసరించే ‘స్వేచ్ఛ, పారదర్శకత’ విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ‘‘నేను రాజకీయాల్లోకి రాకముందు ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాను. మిగతా ప్రాంతాల కన్నా ఇండో పసిఫిక్ లోనే అవకాశాలు అత్యధికంగా కనిపించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 2050 నాటికి యూరప్, నార్త్ అమెరికా కలిసి పావు వంతులోపే వృద్ధిని నమోదు చేస్తాయి. కానీ ఇండో పసిఫిక్ ప్రాంతం ఒక్కటే దాదాపు సగం వృద్ధిని సాధిస్తుంది. అందుకే మేం ట్రాన్స్ పసిఫిక్ ట్రేడ్ డీల్స్ పై దృష్టి పెట్టాం. ఇందులో భాగంగా ఇండియా, ఇండోనేషియాతో కొత్త ఎఫ్టీఏలను కుదుర్చుకుంటున్నాం” అని రిషి వివరించారు. ఇండియా, బ్రిటన్ మధ్య ఎఫ్టీఏపై చర్చలు ఈ ఏడాది జనవరిలోనే మొదలయ్యాయి. దీపావళి నాటికల్లా అగ్రిమెంట్ కుర్చుకోవాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో వాయిదా పడింది.  

చైనాతో ‘గోల్డెన్ ఎరా’ ముగిసింది.. 

బ్రిటిష్ విలువలు, ప్రయోజనాలకు చైనా సవాలుగా మారిందని రిషి సునక్ అన్నారు. చైనా, బ్రిటన్ సంబంధాల్లో ‘గోల్డెన్ ఎరా’ ముగిసిందన్నారు. చైనా రోజురోజుకూ మరింత అధికంగా నియంతృత్వం దిశగా వెళ్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రపంచ వ్యవహారాల్లో చైనా పాత్రను కాదనలేమని, అందుకే ఆ దేశం నుంచి ఎదురయ్యే పోటీని, సవాళ్లను ఇతర దేశాలతో కలిసి ఎదుర్కొంటామన్నారు. చైనా అనుసరిస్తున్న కోల్డ్ వార్ విధానాలను తాము అంగీకరించబోమన్నారు. చైనా ప్రభుత్వం కరోనా పేరుతో స్ట్రిక్ట్ లాక్ డౌన్ లు పెడుతూ ప్రజల స్వేచ్ఛను 
హరిస్తోందని విమర్శించారు.