
న్యూఢిల్లీ : ఏ తండ్రికి అయినా కుమార్తె చదువు, పెళ్లి రెండు ముఖ్యమైన బాధ్యతలు. ఈ బాధ్యతలను నెరవేర్చడానికి మీకు పెద్దమొత్తం అవసరం. అందుకే ఈరోజు నుండే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. పెట్టుబడి ప్రయోజనాల కోసం అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలు ఉన్నాయి. అయితే పోస్ట్ ఆఫీస్ నిర్వహించే సుకన్య సమృద్ధి (ఎస్‌ఎస్‌వై) యోజన వీటిలో బెస్ట్ అని చెప్పవచ్చు. భారీ వడ్డీకి, పన్ను మినహాయింపును అందించడానికి ఉత్తమ ఎంపికలలో ఇదీ ఒకటి. ఎస్‌ఎస్‌వై పథకం అంటే ఏమిటి ? రూ. 44 లక్షల ఫండ్ ఎలా పొందాలి ? పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
ఇవి గుర్తుంచుకోండి :
మీ కుమార్తె వయస్సు మూడు సంవత్సరాలు అనుకుందాం. మీరు 2024 నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు మొదటి 15 సంవత్సరాలు.. అంటే 2039 వరకు ఏటా డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆమెకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే 2045 సంవత్సరంలో, ఎస్‌ఎస్‌వై ఖాతా మెచ్యూర్ అవుతుంది. మొత్తం మీకు ఒకేసారి అందిస్తారు. చదువు లేదా వివాహం కోసం డబ్బు ముందస్తు గానూ తీసుకోవచ్చు. కనీసం 21 ఏళ్లు వచ్చాకే విత్‌డ్రాయల్‌కు అనుమతి ఇస్తారు.
ఎస్‌ఎస్‌వై పథకం అంటే ఏమిటి?
1. భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను ఆడపిల్లల కోసం రూపొందించింది. భవిష్యత్‌లో వారికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
2. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల తల్లిదండ్రులు ఎస్‌ఎస్‌వై ఖాతాను తెరవవచ్చు.
3. ప్రస్తుతం ఎస్ఎస్వైలో పెట్టుబడిపై సంవత్సరానికి 8 శాతం వడ్డీ అందిస్తోంది.
4. ఇందులో తల్లిదండ్రులు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
5. ఎస్‌ఎస్‌వై స్కీమ్‌లో 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు.
6. మీ కుమార్తెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు లేదా చదువు కోసం లేదా పెళ్లి గురించి ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు.
44 లక్షల నిధిని ఎలా సంపాదించాలి?
రూ.44 లక్షల ఫండ్‌ను సృష్టించేందుకు, మీరు 15 ఏళ్లపాటు ఏటా రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టాలి.
అంటే 15 సంవత్సరాలలో మీరు మీ ఎస్‌ఎస్‌వై ఖాతాలో మొత్తం 15 లక్షల రూపాయలను జమ చేస్తారు.
ఎనిమిది శాతం వార్షిక వడ్డీ రావడం వల్ల, మీరు ఎస్‌ఎస్‌వై ఖాతాపై మొత్తం రూ. 29,89,690 వడ్డీని పొందుతారు.
మెచ్యూరిటీలో, మీరు పెట్టుబడి పెట్టబడిన మొత్తం రూ. 15 లక్షలు వడ్డీ మొత్తం రూ. 29,89,690 కలిసి పొందుతారు. ఈ లెక్కన మీరు పొందే మొత్తం రూ.44,89,690 అవుతుంది.