భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం బంగారు తులసీ దళాలతో అర్చన జరిగింది. ఉదయం గర్భగుడిలో సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు బాలబోగం నివేదించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. అనంతరం సీతారామచంద్రస్వామి మూలవరులకు బంగారు తులసీ దళాలలో అర్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు.
అక్కడ ముందుగా స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశాక వేదపారాయణాలు జరిగాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నారాయర దివ్యప్రబంధ పారాయణం చేశారు. తర్వాత సీతారామచంద్రస్వామికి నిత్య కల్యాణం చేయగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్, శోభారాణి దంపతులు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,11,116లు, విజయవాడకు చెందిన సుబ్బారావు, ఝాన్సీలక్ష్మి రూ.1,01,116 ను విరాళాలుగా అందజేశారు.
రాపత్సేవ.. గోదావరికి నదీ హారతి
సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయంలో గోవింద మండపం ప్రాంగణంలో రాపత్సేవ వైభవంగా జరిగింది. స్వామికి ఆలయంలో దర్బారు సేవ జరిగిన అనంతరం స్వామిని ఊరేగింపుగా గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ విశేష పూజలనంతరం వేదపారాయణాలు నిర్వహించి, ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం తిరువీధి సేవ కన్నుల పండువగా జరిగింది.
పౌర్ణమి సందర్భంగా ఏరు ఉత్సవాల్లో గోదావరికి నదీ హారతిని అందజేశారు. ముందుగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి, పసుపు, కుంకుమ, పువ్వులు, శేషవస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నదీ హారతులను తిలకించారు. రామనామ స్మరణలు చేశారు. ఇదే సమయంలో మహిళలు నదిలో దీపాలు వదిలారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ నదీ హారతిలో పాల్గొన్నారు.
