ఎన్నికలొస్తేనే గొర్రెలు

ఎన్నికలొస్తేనే గొర్రెలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్ 20న కొండపాకలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఆరోజు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గొల్ల, కురుమలు కోటీశ్వరులు కావాలని హితవు పలికారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వ సబ్సిడీ 75%, లబ్ధిదారుడు చెల్లించాల్సింది 25%, వాటాగా నిర్ణయించారు. 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల పైగా మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇందులో దాదాపు సగం మంది లబ్ధిదారులకు మాత్రమే గొర్రెల పంపిణీ చేశారు. పంపిణీ చేసిన గొర్రెలలో చిన్నపిల్లలను, ఈడు గడిచిన గొర్రెలు(ముసలివి) ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

పక్క రాష్ట్రాలకు చెందిన గొర్రెలు ఇవ్వడం మూలంగా ఇక్కడ వాతావరణం,మేత పడకపోవడం వల్ల చాలా వరకు గొర్రెలు చనిపోవడం జరిగింది. దాదాపు ఇంకా సగం మంది లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వనేలేదు. ఈ పథకాన్ని  రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా  ఇప్పటివరకు పూర్తి చేయలేదు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ తూతూ మంత్రంగా గొర్రెల పంపిణీ చేపట్టడం గొల్ల, కురుమల ఓట్లను 90 శాతం వరకు దండుకోవడం జరుగుతుంది. గొల్ల, కురుమలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ రెండో విడత గొర్రెల పంపిణీ లో భాగంగా లబ్ధిదారుని వాటా పెంచి అనగా 43,750 నిర్ణయించారు. మొదటి విడత కంటే ఇప్పుడు లబ్ధిదారులపై 12,500 అదనపు భారం వేసింది. గతంలో గొర్రెల యూనిట్ 1,25,000 ఉండగా ఇప్పుడు 1,75,000 వరకు పెంచింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మునుగోడు ఉప ఎన్నికలలో పైలెట్ ప్రాజెక్టుగా గొల్ల కురుమల అకౌంట్లో నగదు వేసి  ఫ్రీజ్​ చేసింది.  మునుగోడు గొల్లకురుమల ఓట్లు మాత్రం దండుకున్నది. 

లబ్ధిదారులే కొనుగోలు చేయాలి

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రిగారు మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని పలకడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి లబ్ధిదారునికి నగదు బదిలీ చేసి గొల్ల కురుమలు వారికి నచ్చిన చోట గొర్లను కొనుగోలు చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ హాస్పిటల్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి జీవాలకు సరైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి ప్రతినెల 5000 పింఛన్ ఇవ్వాలి. అదే విధంగా డిగ్రీలు, పీజీలు చేసిన యువతకు సబ్సిడీతో జీరో గ్రీసింగ్​పై అవగాహన కల్పించి ఫార్మ్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.


- హరీష్ నక్క,నెల్లికుదురు మండలం,  మహబూబాబాద్ జిల్లా