సహకార సంఘంలో ఫండ్స్​ గోల్​మాల్​

సహకార సంఘంలో ఫండ్స్​ గోల్​మాల్​
  • ఇన్నాళ్లూ కాగితాలపైనే స్టాక్ నిల్వలను గుర్తించిన అధికారులు
  • సొసైటీ ఉద్యోగి ఆత్మహత్యతో కలకలం 
  • తనిఖీల్లో రూ.70 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్లు గుర్తింపు
  • ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ ఆడిట్ రిపోర్ట్​

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో అతి పెద్దదైన హుస్నాబాద్ విశాల పరపతి(లార్జ్ సైజ్) సహకార సంఘంలో ఫండ్స్​గోల్​మాల్​వ్యవహారం కలకలం రేపుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతోనే ఫండ్స్​పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా కాగితాలపైనే స్టాక్​నిల్వలు చూపడంతో అక్రమాలు బయటపడలేదు. ప్రత్యక్ష తనిఖీలతో ఇవి బయటికి వచ్చినా అధికారులు సీక్రెట్​మెయింటెన్​చేస్తూ వచ్చారు. సొసైటీ ఉద్యోగి ఆత్మహత్య తో విషయం కాస్తా  బయటకు రావడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. హుస్నాబాద్ సొసైటీలో దాదాపు రూ.70 లక్షలకు పైగా ఫండ్స్​పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే  స్టాక్ డిఫిసిట్ రూ.1.01 కోట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించి సీఈవోకు నోటీసు ఇచ్చారు. దీంతో రెండు రోజుల కింద రూ.28 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిలో రూ.65 లక్షల వరకు ఎరువులు, రూ.8 లక్షలు డీజిల్​అమ్మకాలకు సంబంధించిన పైసలు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు జిల్లా కో ఆపరేటివ్ అధికారులు స్పెషల్ ఆడిట్ జరుపుతున్నారు. దీనిపై ఒకట్రెండ్ రోజుల్లో రిపోర్టు రానుంది. ఆ తర్వాత ఎంత మేరకు అక్రమాలు జరిగాయో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సొసైటీలో 15 వేల మంది సభ్యులు

హుస్నాబాద్ సొసైటీలో దాదాపు 15 వేల మంది సభ్యులున్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల పరిధిలో బ్యాంకు తరహాలో లావాదేవీలు నడిపే ఈ సొసైటీలో ఏటా దాదాపు రూ.20 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. వరి, కందులు, మొక్కజొన్న  కొనుగోళ్లు, ఎరువుల అమ్మకాలతోపాటు  గోల్డ్ లోన్ బిజినెస్, వాహనాల లోన్స్, డిపాజిట్లను సైతం సేకరిస్తారు. ఏటా రెండు సీజన్లలో వడ్లు కొనేందుకు దాదాపు 65 మంది తాత్కాలిక సిబ్బందిని తీసుకుంటుండగా మరో ఐదుగురు పర్మినెంట్​సిబ్బంది పనిచేస్తుంటారు. ఇతర పనుల కోసం మరో ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. సొసైటీ పరిధిలో ఏడు స్టాక్ పాయింట్ల ద్వారా ఎరువులు అమ్మడంతో పాటు ప్రత్యేకంగా ఒక పెట్రోల్ బంక్ ను సైతం నిర్వహిస్తోంది.

నెల రోజుల కింద అక్రమాల గుర్తింపు

హుస్నాబాద్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు నెల రోజుల క్రితం కో ఆపరేటివ్​అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని నెలలుగా రిపోర్టులకు సంబంధించి సరైన సమాచారం రాకపోవడంతో స్టాక్ పాయింట్ల వారీగా ఎరువుల లెక్కలు, పెట్రోల్, డీజిల్​అమ్మకాలను అధికారులు పరిశీలించారు. ఈక్రమంలో ఫండ్స్​పక్కదారి పట్టినట్లుగా గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1.01 కోట్లు గోల్​మాల్​జరిగినట్లు గుర్తించి సీఈవోకు మెమో జారీ చేశారు. దీనిపై ఎలాంటి  స్పందన రాకపోవడంతో కో ఆపరేటివ్ అధికారులు స్పెషల్ ఆడిట్ ను ప్రారంభించారు. రెండు రోజుల కింద ఓ ఉద్యోగి రూ.28 లక్షలు బ్యాంకు అకౌంట్​లో జమ చేయడానికి వచ్చాడు. పూర్తి స్థాయి ఆడిట్ జరిగే వరకు ఆ పైసలను అలాగే ఉంచాలని అధికారులు ఆదేశించడం గమనార్హం. 

ఉద్యోగి సూసైడ్​తో అక్రమాలు బహిర్గతం 

హుస్నాబాద్ సొసైటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కొప్పు వినయ్  ఇటీవల ఆత్మహత్య చేసుకోగా అక్రమాలు బయటకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు వినయ్ సెల్ఫీ వీడియోలో ఫండ్స్​ పక్కదారి పట్టించిన విషయాన్ని వెల్లడించాడు. సొసైటీలో లక్షల రూపాయల స్కామ్ జరిగితే వాటితో సంబంధం లేకున్నా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసు కేసులు, జైలు అంటూ బెదిరించారని వీడియోలో పేర్కొన్నాడు. తన ప్రమేయం లేకుండానే గోడౌన్​నుంచి ఎరువులు తీసుకెళ్లారని వీడియోలో పేర్కొనడం చూస్తుంటే ఈ గోల్ మాల్ వెనుక మరికొందరు ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. గత నాలుగేండ్లలో నలుగురు సీఈవోలు మారారు. బాధ్యతలు తీసుకునేటప్పుడు వీరిలో ఎవరూ స్టాక్ నిల్వలను పట్టించుకోలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఎప్పటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయనే విషయంపై స్పష్టత కొరవడింది. దీనికి తోడు 2019–-20,2020–-21 సంవత్సరాల్లో ఆడిట్ చేసినప్పుడు ఈ వ్యవహారం బయటపడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

స్టాక్ పాయింట్ల వారీగా తనిఖీ

హుస్నాబాద్ సొసైటీ పరిధిలోని ఏడు స్టాక్ పాయింట్లలో ఎరువుల స్టాక్ ను డైరెక్ట్​గా అధికారులు పరిశీలించాకే ఈ గోల్ మాల్ వ్యవహారాన్ని గుర్తించారు. అంతకుముందు నెలవారీ నివేదికల్లో స్టాక్ ఉన్నట్టుగా కాగితాలపై చూపుతూ పైసలు వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున గోల్​మాల్​జరిగినట్లు బయటపడినా పాలకవర్గం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా కో ఆపరేటివ్  అధికారులు స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తుండగా... వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. 

స్టాక్ డెఫిసిట్ పై స్పెషల్​ ఆడిట్

హుస్నాబాద్ సొసైటీలో స్టాక్ డిఫిసిట్ పై పూర్తి స్థాయిలో స్పెషల్ ఆడిట్ జరుపుతున్నాం. ఆడిట్​ రిపోర్టు రాగానే స్టాట్యూటరీ ఎంక్వైరీ చేస్తాం. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.1.01 కోట్ల మేర స్టాక్ డిఫిసిట్ ఉన్నట్టుగా గుర్తించి  సీఈవోకు మెమో ఇచ్చాం. ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ ఆడిట్ రిపోర్టు వస్తుంది. దాని ఆధారంగా కో ఆపరేటివ్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధ్యులెవరైనా వదిలిపెట్టం.

- చంద్రమోహన్ రెడ్డి, డీసీవో