గోండుల దైవం.. పెర్సిపన్​

గోండుల దైవం.. పెర్సిపన్​

రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్ని పోటీపరీక్షల్లో తెలంగాణ ప్రాంతంలోని గిరిజన తెగలు, వారి సంప్రదాయాల గురించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్​ ట్రైబ్స్​ జీవనవిధానం గురించి తెలుసుకుందాం.. 

ప్రధాన్​లు

ఆదిలాబాద్​ జిల్లాలో నివసించే ముఖ్యమైన ఆదిమ గిరిజన తెగ ప్రధాన్​. వీరు ద్రావిడ సంతతికి చెందిన వారు. ప్రధాన్​ల సంస్కృతి సింధూ నాగరికతకు చెందింది. గోండుల ఇతిహాసాలను, జానపదాలను పాడి వినిపించే సంప్రదాయ కళాకారులు ప్రధాన్లు. ఆదిలాబాద్​లో  గల ప్రధాన్లు భాషాపరంగా మరాఠీ మాట్లాడుతారు. కానీ, మాతృ భాష గోండి. వీరి ప్రధాన వృత్తి గోండుల ధర్మ సంస్కృతిని ప్రచారం చేయడం. ప్రధాన్​లలో వరకట్న సంస్కృతి లేదు. కానీ ప్రస్తుతం అడుగుతున్నారు.  

గోండులు 

గోండులు తమకు తాము కోయ్​తుర్​ లేదా కోయ్​గా గోండి భాషలో పిలుచుకుంటారు. వీరికి తక్కువ సామాజిక హోదా ఇవ్వబడింది. వీరు రాజ్​ గోండులతో వివాహ సంబంధాలు పెట్టుకోరు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో ఎక్కువ జీవిస్తారు. వీరు మహారాష్ట్రలోని చందా తెలంగాణలోని ఆదిలాబాద్​ వరకు ప్రముఖ రాజ్యవంశాలుగా పరిపాలించేవారు. గోండులలో మరియాలు, కొండమరియాలు, బిషోమార్​ మరియాలు అనే మూడు ఉప తెగలు కూడా ఉన్నాయి. గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు. గోండులు నాగదేవత, పెర్సిపన్​ అనే దేవతను ఎక్కువ ఆరాధిస్తారు. ఎద్దు కొమ్ములు అలంకారంగా ధరిస్తారు. గోండులు, కోలమ్​ల కంటే ఉన్నతమైన సామాజిక హోదాను నాయక్​పోడ్​లు ప్రకటించుకున్నారు. గోండుల ముఖ్య పండుగలు దాండారీ, ఖేల్​.

కొండరెడ్లు

ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో గల కొండలపైన నివసిస్తారు. కాబట్టి వీరికి కొండరెడ్లు అని పేరు వచ్చింది. వీరినే హిల్​ రెడ్లు, రాచరెడ్లు, పాండవరెడ్లు అని కూడా పిలుస్తారు. కొండరెడ్లు చామనఛాయ రూపం కలిగి ఉండి కొంచెం పొడవుగా ఉండి బలిష్టంగా ఉంటారు. పొడవైన జుట్టును కలిగి ఉండి ముడివేసుకొనే ఆనవాయితీ కలదు. ఈ ప్రాంత కొండరెడ్లు నాగలిని వినియోగించి వ్యవసాయం చేస్తారు. ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట మండలంలో కవాడిగుండ్ల, గోగులపుడి, కన్నాయిగూడెం, బండారిగూడెం, గాండ్లగూడం ప్రధానమైన కొండరెడ్ల గ్రామాలు ఉన్నాయి. తగాదాలు ఏర్పడితే తీర్చడానికి జాతి పెద్ద ఉంటారు. 

కోయలు

తెలంగాణలో కోయలు అధికంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్​, కరీంనగర్​ జిల్లాల్లో నివసిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నివసించే గిరిజనుల్లో అధిక శాతం కోయలు ఉంటారు. వీరి మాతృభాషను కోయ భాషగా పిలుస్తారు. వీరి గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటానికి సంప్రదాయక పంచాయతీలు ఉన్నాయి. ఈ కుల పంచాయతీకి పిన్నపెద్ద, పటేల్​, పూజారి మొదలైన వారు నాయకత్వాన్ని వహిస్తారు. 

యానాదులు

యానాదులు దేశంలో ఆర్యుల రాక ముందు నుంచే తమ పుట్టు పూర్వోత్తరాలు తెలియక అమాయకులుగా అనాదిగా నివసిస్తున్నారు. యానాదుల్లో ప్రధానంగా రెడ్డి యానాదులు, చెల్ల యానాదులు, అడవి యానాదులు, తూర్పు యానాదులు అనే తెగలు కనిపిస్తాయి. వీరి నృత్యాన్ని చిందు నృత్యం అంటారు. ఏకుల వెంకటేశ్వర్లు తన ఎన్నెల నవ్వు అనే నవలలో యానాదుల సమగ్ర జీవితాన్ని చిత్రీకరించారు. 

నాయకపోడులు

నాయకపోడుల జనాభా ప్రధానంగా ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది.  వీరు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నివసిస్తారు. నాయకపోడులను ప్రాంతీయ భాషల్లో నాయక, నాయకులు, నాయకపు, నాయకపోళ్లుగా పిలుస్తారు. గోండులు నాయకపోడులను మచ్చలీర్​గా పిలుస్తారు. నాయకపోడులు దక్షిణ భారత గిరిజన తెగ. మొదటిసారి వచ్చిన పంటను కొత్తల పేరుతో పాండవులకు నైవేద్యంగా సమర్పిస్తారు.   

కోలాములు 

కోలాములను వారి భాషలో కోలావర్లు అని వ్యవహరిస్తారు. వీరి భాష గోండి భాషకు దగ్గరగా ఉంటుంది. కోలాముల పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం చేస్తారు. అధికంగా ఆదిలాబాద్​ జిల్లాలో నివసిస్తున్నారు. గణ దేవత, ఆయక మాత దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. పూజారి వర్గం వంశపారంపర్యంగా ఒకే కుటుంబం నుంచి ఉంటారు. కోలాములు పూజ చేయడంలో గోండులకు సహకరిస్తారు. 

లంబాడా 

వీరు పూర్వకాలంలో ఉప్పు బస్తాలను పశువుల వీపుపై గొనె సంచుల్లో నింపి వ్యాపారాలు చేసేవారు. అంటే లుమాన్​ + భాడా అంటే ఉప్పు కిరాయి, ఉప్పు రవాణా అనే అర్థాలు చెప్పుకోవచ్చు. లూన్​ + భాడా అనే పదం కాలక్రమంలో లంబాడాగా మార్పు చెందింది. తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ లంబాడీలు. 

ఎరుకలు

అతి పెద్ద ఆదిమ గిరిజన జాతిగా మనుగడ సాగిస్తున్న ఎరుకల తెగని ఎరుకల, కుర్రు, కైకాడి తదితర పేర్లతో పిలుస్తుంటారు. ఎరుక అంటే తెలిసినవాళ్లు అని ప్రధాన అర్థం వస్తుంది. వీరు సోది తెలిసిన వాళ్లు కాబట్టి ఎరుక అనే పదం వాడుకలోకి వచ్చింది. ఎరుకల్లోని ఉప తెగలు కూటు ఎరుకల, ఎద్దు ఎరుకల, భజంత్రీ ఎరుకల, దబ్బ ఎరుకల, ఈతకట్టె ఎరుకల. 

చెంచులు 

తెలంగాణ షెడ్యూల్డ్​ తెగల జాబితాలో మూడో కులం. వీరు నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తారు. మహబూబ్​నగర్​, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. చెంచులు చిన్నసమూహాలుగా నివసించే ప్రాంతాలను పెంటలు అంటారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన జాతి చెంచులు. వీరి నృత్యాల్లో నెమలి, కోతి నృత్యం ప్రధానమైనవి. వీరి నృత్యాల్లో సింగి, సింగడు ప్రధాన పాత్రధారులు. 

1. కింది వాటిలో తెలంగాణలోని గిరిజన తెగ? (4)

ఎ. యానాదులు  బి. కోయలు సి. గోండ్లు  డి. అన్నీ

2. కింది వాటిలో గిరిజన తెగ లక్షణం? (4)

ఎ. పండిన పంటను సమష్టిగా పంచుకుంటారు

బి. సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు

సి. ధనిక, పేద తారతమ్యాలు ఉండవు

డి. పైవన్నీ సరైనవే