యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అసలు ఆ ఆలోచనే లేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ స్టేట్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇస్తే.. ఆలేరు నుంచి గొంగిడి సునీతనే మరోసారి పోటీ చేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
తన భార్య సునీతకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా నేనే అడ్డుకుంటున్నానని, తనకే ఆలేరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నానని ఓ ఛానల్ లో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దయచేసి ఇలాంటి వార్తలను ఇంతటితో ఆపాలని ఆయన సూచించారు.