
న్యూఢిల్లీ: భారత్‌లో వినియోగం పెరుగుతోందని, దీంతో ట్రావెల్ సెక్టార్ పుంజుకుంటుందని, భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) ఏజీఎంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 2030 నాటికి గ్లోబల్‌గా 700 హోటళ్లు, రూ.15 వేల కోట్ల ఆదాయం సాధించాలని చెప్పారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించినవారికి, రతన్ టాటాకు ఆయన నివాళులర్పించారు. రతన్ టాటా అసాధారణ నాయకుడని, టాటా గ్రూప్‌ను దశాబ్దాలుగా ముందుకు తీసుకెళ్లారని అన్నారు. కొవిడ్ తర్వాత నుంచి సర్వీస్ సెక్టార్ ఏడాదికి 8శాతం చొప్పున వృద్ధి చెందుతోందని, విదేశీ పర్యాటకం కోటి మందికి చేరుకుందని వివరించారు.
2024-–25లో ఐహెచ్‌సీఎల్ 74 కొత్త హోటళ్లు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే 26 ఓపెన్ చేసింది. మొత్తం 380 హోటళ్లు నిర్వహిస్తున్న ఈ కంపెనీ, రూ.5,145 కోట్ల స్టాండ్‌ఎలోన్ ఆదాయం, రూ.1,430 కోట్ల లాభం సాధించింది. కన్సాలిడేటెడ్‌గా రూ.8,565 కోట్ల ఆదాయం, రూ.1,908 కోట్ల లాభం పొందింది. కంపెనీ దగ్గర రూ.3 వేల కోట్ల క్యాష్ నిల్వలు ఉన్నాయి.